బీఆర్‌ఎస్‌ హయాంలో బీసీల అభివృద్ధిపై చర్చకు సిద్ధం

ఏ సెంటర్‌ కైనా చర్చకు వస్తా.. ఇక తేల్చుకోవాల్సింది పీసీసీ అధ్యక్షుడే : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Advertisement
Update:2025-01-03 18:38 IST

బీఆర్‌ఎస్‌ హయాంలో బీసీల అభివృద్ధిపై చర్చకు రావాలన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్‌ ను స్వీకరిస్తున్నానని ఏ సెంటర్‌ లో, ఏ గల్లీలో చర్చ పెట్టినా వస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ లో నిర్వహించిన బీసీ మహాసభలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో బీసీల కోసం ఏం చేశారు.. కాంగ్రెస్‌ ఏం చేసిందో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. ఈ బీసీ మహాసభతో చరిత్రలో ఒక మైలురాయిని వేశామన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని, బీసీల సమస్యలపై మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీసీల్లోని 130 కులాల్లో ఒక్కో కులానికి ఒక్కో సమస్య ఉందన్నారు. వాటిని పరిష్కరించడానికి మాత్రం ముఖ్యమంత్రికి మనసొప్పడం లేదన్నారు. కుల వృత్తుల వారికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేయడం దారుణమన్నారు. కొత్త పథకాలను అమలు చేయకున్నా కనీసం పాత పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.




 

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో కర్నాటక, బిహార్ వంటి విఫలైన అనుభవాలు ఉన్నా కూడా డెడికేటెడ్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదన్నారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నారు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే... మరో కమిషన్ నివేదిక ఇస్తుందని, ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా అని ప్రశ్నించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్నారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మాయదారి మాటలతో, మోసపూరిత పనులతో ప్రజలను మభ్య పెట్టవద్దని సూచించారు. బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావని కాంగ్రెస్ నాయకులు తనను ప్రశ్నిస్తున్నారని, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట్లాడితే ముందే ఎందుకు మాట్లాడలేదని వాళ్లే అంటారని అన్నారు.

రాజ్యాంగంలోనే బీసీలకు రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేదని అభిప్రాయపడ్డారు. బీసీలకు రాజ్యంగ రక్షణను సాధించడమే అంతిమ లక్ష్యమని, అందుకోసం పోరాడుతామని తెలిపారు. దీర్ఘకాలిక లక్యంగా పెట్టుకొని ఆ పోరాటం చేస్తామన్నారు. మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారని, ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా అని ప్రశ్నించారు. మండల్ కమిషన్ ను మొరార్జీ దేశాయ్ నియమిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా అమలు చేయనిది అని ప్రశ్నించారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మళ్లీ కాంగ్రెస్సేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేశారని, దాంతో బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని మండిపడ్డారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. 2011 కులగణన చేసినా నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదని, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదన్నారు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తాను చెప్పిన ఈ విషయాలు తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు.


 



ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయని అన్నారు. ముఖ్యంగా కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలని అన్నారు. బీసీ సంఘాలతో కలిసి తాము చేసిన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తమ ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయని అన్నారు. సావిత్రీ బాయి పూలే ఆడబిడ్డ కాదు.. పులిబిడ్డ అని కొనియాడారు. మహిళా విద్యకు ఆమె ఎంతగానో కృషి చేశారని, ఎంతో మంది మహిళలకు చదువు నేర్పించిన వ్యక్తి సావిత్రీబాయి అని కీర్తించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారని కొనియాడారు. కలిసికట్టుగా ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగివచ్చి బీసీలకు న్యాయం చేస్తాయని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాలని, జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని, అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాలను బీసీ మహాసభలో ఆమోదించారు.




 

ఈ మహాసభలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్, నాయకులు సుమిత్రా తానోబా, రూప్ సింగ్, ముఠా జైసింహ, గట్టు రామచందర్ రావు, క్యామ మల్లేశం, పల్లె రవి కుమార్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మఠం భిక్షపతి, కిషోర్ గౌడ్, ఉపేందర్, నవీన్ ఆచారి, వరలక్ష్మీ మంచాల, అనంతుల ప్రశాంత్, పెంట రాజేశ్, అప్పాల నరేందర్ యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, కిశోర్ యాదవ్, బొల్ల శివశంకర్, ఆలకుంట హరి, మహేందర్, గోవర్ధన్ యాదవ్, గొరిగే నరసింహ, గోప సదానంద్‌, కోట్ల యాదగిరి, నరహరి, దుగట్ల నరేశ్‌, మారయ్య, కుమార స్వామి, శ్రీనివాస్ చారి, రమేష్ బాబు, హరిప్రసాద్, సురేందర్, విజేందర్ సాగర్, శ్రీధర్ చారి, రవీంద్రనాథ్, శ్రీనివాస్, ప్రవీణ్, భారత అఖిల్, హరిదేవ్ సింగ్, సురేశ్‌, మురళీకృష్ణ, నిమ్మల వీరన్న, మందుల శ్రీనివాస్, నరసింహ రాజు, ప్రవీణ్, పార్వతయ్య, నరసింహ, రాకేశ్‌, మహేశ్‌, శ్రీను, హుస్సేన్, రామచందర్, మాధవ్, శ్యాంసింగ్ లోదే, శివ కుమార్, వేణుమాధవ్, నవీద్, వరలక్ష్మి, స్వప్న, లావణ్య యాదవ్ పద్మా గౌడ్, పరశురాం, ఎల్చాల దత్తాత్రేయ, నరేందర్, డాక్టర్ కీర్తిలతా గౌడ్, వింజమూరి రాఘవాచారి, సాల్వాచారి, రూపా దేవి, అప్ప సతీష్ తో పాటు 70కిపైగా కుల సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు.

Tags:    
Advertisement

Similar News