ప్రజావాణిలో డీఎస్సీ 2008 బాధితుల ఆందోళన
కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించే వరకు కదిలేది లేదని బైఠాయింపు
మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో డీఎస్సీ -2008 బాధితులు ఆందోళనకు దిగారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి మూడు నెలలు గడిచినా తమకు పోస్టింగ్ లు ఇవ్వడం లేదని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిలింట్ షెడ్యూల్ ప్రకటించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ప్రజాభవన్ లోనే భైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపించాలని నినాదాలు చేశారు. 1,399 మందిని డీఎస్సీ -2008లో అర్హులుగా గుర్తించారని, అందరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 2024 సెప్టెంబర్ లోనే పూర్తి చేశారని తెలిపారు. 15 ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను ఈ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుందనుకుంటే కారణాలు చెప్పకుండా పోస్టింగులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, దాదాపు ఏడాది అవుతున్నా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.