పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు
మంత్రి పొన్నం ప్రభాకర్
పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని వాళ్లకు ఈ రోజు బీసీల శక్తి తెలిసి వచ్చిందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ రాజకీయ పదవుల్లో ఏదో ఒక పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలో తాను హక్కుదారుడినని చెప్పినందుకు ఈటల రాజేందర్‌ను బయటికి పంపారని అన్నారు. బీసీ హాస్టళ్లను పదేళ్లలో పట్టించుకోలేదన్నారు. తమ సీఎం ఒక కులం అయితే మరో కులానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్ లో ఆ స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టి ఉంటే బీసీలకు న్యాయం జరిగేది అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు. జయశంకర్, దేశిని చిన మల్లయ్య, శ్రీకాంతాచారి తల్లిని అవమానించినప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చేయిస్తున్న కుటంబ సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టి నిపుణులతో చర్చించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసి తీరుతామన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎవరు ఎంత మంది ఉంటే అంత న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల ఇష్టాఇష్టాలతో సంబంధం ఉండదని.. పార్టీ ఎజెండానే ముఖ్యం అన్నారు.