నాగోబా జాతరకు ముహూర్తం ఖరారు ఎప్పుడంటే ?
దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన సంబరం నాగోబా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది.
దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన నాగోబా జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న మొదలు అవుతున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది 28న అమావాస్య కావడంతో ఆ రోజున అర్ధరాత్రి పూజలు చేసి.. జాతరను ప్రారంభిస్తారు.
ఈ జాతరలో కీలమైన మూడోరోజు నిర్వహించే గిరిజన దర్బార్ ఈ నెల 31న జరగనుంది. జాతర ఏర్పాట్లకు సంబంధించి ఇవాళ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఉట్నూరు ఐటీటీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ గౌష్ ఆలం, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇతర అధికారులు కేస్లాపూర్‌లో సమావేశమయ్యి, చర్చించారు. ఈసారి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను జాతరకు ఆహ్వానించాలని నిర్ణయించారు. జాతర పూర్తయ్యే వరకు కేస్లాపూర్ చుట్టుపక్కల 5 కి.మీ.ల పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధించనున్నారు.