కరెంటు కోతలపై నెటిజన్ ట్వీట్.. కేటీఆర్ మాస్ రిప్లయ్..!
సోషల్‌మీడియాలో కరెంటు కోతలపై సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోతోంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు పెరిగాయి. మరమ్మతులు, చెట్ల నరికివేత లాంటివి కరెంటు కోతలకు కారణంగా అధికారులు చెప్తున్నారు. పవర్ కట్ సమస్యలుంటే తమను సంప్రదించాలంటూ అధికారులు ఫోన్ నంబర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక సోషల్‌మీడియాలో కరెంటు కోతలపై సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోతోంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా ట్విట్టర్‌లో ఓ నెటిజన్ కరెంటు కోతలపై కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. 3 గంటలకు మించి కరెంటు కట్ చేస్తుండడంతో వర్క్ ఫ్రమ్‌పై ఎఫెక్ట్ పడుతోందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేసవి ప్రారంభానికి రెండు నెలల ముందే ఇలాంటి పరిస్థితి ఉందని.. కాంగ్రెస్ అద్భుత పాలన అలాంటిదంటూ సెటైర్ వేశారు కేటీఆర్. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయంటూ అంచనా వేశారు.
అసెంబ్లీ ఎన్నికల టైంలో కరెంటు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ వస్తే కరెంటు పోవడం ఖాయమంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసింది.