కాంగ్రెస్ పై విమర్శల కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక అతిథులు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఉదాహరణగా చూపించి తెలంగాణలో అధికారంలోకి రావాలని అధినాయకత్వం అంచనా వేస్తుంటే, అవే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యర్థి పార్టీల నేతలు ఇక్కడ కాంగ్రెస్ బండారం బయటపెడుతున్నారు.

Advertisement
Update:2023-11-23 12:08 IST

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కీలక నేతల్ని ఇక్కడకు పిలిపిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. అయితే ఇప్పుడు ఆయా రాష్ట్రాల నుంచే వారి వైరి వర్గం నేతలు కూడా తెలంగాణకు వస్తున్నారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఇక్కడ చెబుతున్నారు. కాంగ్రెస్ నమ్మి ఓటు వేయద్దని, మోసపోవద్దని తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత కర్నాటక నుంచి వచ్చిన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ఇలానే కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఆ రాష్ట్ర మాజీ సీఎం జైరాం ఠాకూర్ కూడా హస్తం పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు.

హిమాచల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు హిమాచల్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్. 10 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారని, ఆ హామీ మరచిపోయారన్నారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందని, కానీ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పారు కానీ అమలులో మాత్రం కాంగ్రెస్ నేతలు వెకడుగు వేశారన్నారు. ఫ్రీ కరెంట్ మాట దేవుడేరుగు.. విద్యుత్ పై అదనపు చార్జీలు వడ్డిస్తున్నారని విమర్శించారు జైరాం ఠాకూర్. అక్కడ 10 గ్యారెంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ ఇక్కడ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఉదాహరణగా చూపించి తెలంగాణలో అధికారంలోకి రావాలని అధినాయకత్వం అంచనా వేస్తుంటే, అవే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యర్థి పార్టీల నేతలు ఇక్కడ కాంగ్రెస్ బండారం బయటపెడుతున్నారు. ఈ ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్ముతారా లేదా అనే విషయం పక్కనపెడితే.. అక్కడి నుంచి వచ్చి చెబుతున్న వ్యక్తుల మాటలకు సాధికారత ఉంటుందనేది మాత్రం వాస్తవం. అందుకే ఈ ప్రచారాలతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది.

Tags:    
Advertisement

Similar News