మోరంచపల్లి వాసులు సేఫ్.. 108 గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తరపున సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 108 గ్రామాల నుండి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు సీఎస్ శాంతి కుమారి.
మునుపెన్నడూ లేని భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గంటకోసారి సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు సీఎస్ శాంతికుమారి. సహాయ, పునరావాస చర్యలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలకు ఆదేశించారు.
భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తరపున సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. వరదనీటిలో చిక్కుకున్న 70 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెండు హెలికాప్టర్ల సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. 600మందిని బయటకు తరలించి గ్రామాన్ని ఖాళీ చేయించారు. అటు వరంగల్ పట్టణంలో సైతం పడవల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇసుక క్వారీలో చిక్కుకున్న 19మందిని కాపాడారు అధికారులు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 108 గ్రామాల నుండి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు సీఎస్ శాంతి కుమారి.
వరద ప్రవాహం పక్కన నిలబడి సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి నీళ్ల వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకి రావొద్దని సూచించారు. శుక్రవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు.
ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, బూర్గంపాడుకు హెలికాప్టర్ ను సహాయక చర్యలకోసం పంపించినట్టు తెలిపారు సీఎస్ శాంతికుమారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అవసరమైన ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. వారికి అత్యవసర మందులు అందజేస్తున్నట్టు తెలిపారు. జిల్లాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులన్నీ 24 గంటలు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సీఎస్ శాంతి కుమారి.