కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రైల్వే లైనుకు ఎన్‌బీడబ్ల్యూఎల్ గ్రీన్ సిగ్నల్
రైల్వే లైను నిర్మాణానికి ఎన్‌బీడబ్ల్యూఎల్ కొన్ని షరతులు విధించింది. ఈ రైల్వే లైన్ వెళ్తున్న మార్గంలో రెండు ఓవర్‌పాస్‌లు, ఒక అండర్ పాస్ నిర్మించాలని ఆదేశించింది.
తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా రైల్వే లైను వేయడానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) అనుమతులు జారీ చేసింది. అటవీ ప్రాంతంలోని 21 హెక్టార్ల భూమిని రైల్వే లైన్ కోసం మళ్లించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగజ్‌నగర్ డివిజన్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఇప్పటికే రెండు రైల్వే లైన్లు ఉన్నాయి. వాటికి సమాంతరంగా మూడో లైన్ వేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మాకుడి, రెచ్నీ రోడ్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ మూడో లైన్ రానున్నది. చెన్నై-ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ మార్గంలో నిర్మిస్తున్న మూడో లైనులో భాగమే ఈ రైల్వే మార్గమని అధికారులు చెప్పారు.
కాగా, రైల్వే లైను నిర్మాణానికి ఎన్‌బీడబ్ల్యూఎల్ కొన్ని షరతులు విధించింది. ఈ రైల్వే లైన్ వెళ్తున్న మార్గంలో రెండు ఓవర్‌పాస్‌లు, ఒక అండర్ పాస్ నిర్మించాలని ఆదేశించింది. రైల్వే లైనుకు ఇరు వైపుల ఉన్న అడవి నుంచి వణ్యప్రాణులు ఇరువైపులా క్షేమంగా తిరగడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే ఈ మార్గానికి సంబంధించిన అభ్యంతరాలపై అధికారులు వివరణ ఇవ్వడంతో.. ఆ మేరకు 21 హెక్టార్ల భూమిని రైల్వే లైను కోసం వాడుకోవడానికి అనుమతి లభించింది.
రైల్వే లైన్ నిర్మించే ప్రాంతంలో అండర్ పాస్, ఓవర్ పాస్‌ల నిర్మాణ బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదే. వణ్యప్రాణులు వచ్చే నీటి చెలమలు, కాలువల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా లైను నిర్మించాలని ఎన్‌బీడబ్ల్యూఎల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అటవీ శాఖ గుర్తించిన వణ్యప్రాణి రాకపోక మార్గాల వద్ద ఆటంకాలు లేకుండా చూడాలని రైల్వే శాఖకు చెప్పింది. ఇక కోల్పోతున్న అటవీ ప్రాంతానికి బదులు.. మరో చోట సహజమైన గడ్డి భూముల అభివృద్ధి, నీటి గుంతలు, సోలార్ బోర్ వెల్స్, సైన్ బోర్డులు, ఇతర వసతుల కల్పనకు రైల్వే శాఖ రూ.2.8 కోట్లు కేటాయించనున్నది. ఈ నిధులను రాబోయే ఐదేళ్ల పాటు ఖర్చు చేయాలని ఆదేశించింది.
ఇక ఈ ప్రాజెక్టులో వల్చర్ కన్వర్జేషన్ ప్రాజెక్టు కూడా ఉన్నది. కాగజ్‌నగర్ డివిజన్‌లో కొన్నాళ్లుగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన స్థలాలను ఇప్పటికే కేటాయించారు. ఇక్కడ బర్డ్ ట్రాకర్స్, నెస్టింగ్, బ్రీడింగ్‌లను బయాలజిస్టులు ఏర్పాటు చేయడానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చాల్సి ఉన్నది.