కేంద్రం మరో కుట్ర.. తెలంగాణ జౌళి బోర్డ్ మూసివేత

తెలంగాణపై కక్షతో, వివవక్షతో కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిన పాపాలు చాలానే ఉన్నాయి. అందులో జనపనార బోర్డ్ కొత్తగా చేరింది. జనపనార బోర్డ్ ని కోల్ కతా కు తరలించి మరోసారి కేంద్రం మోసం చేసింది.

Advertisement
Update:2023-01-12 06:59 IST

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనేది అక్షర సత్యం అని మరోసారి రుజువైంది. తెలంగాణ నుంచి జౌళి బోర్డ్ ని తరలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక్కడినుంచి తీసుకెళ్లి దాన్ని కోల్ కతాలోని బోర్డ్ లో విలీనం చేశారు. ఉద్యోగుల్ని అక్కడికి వెళ్లి పనిచేయాలని సూచించారు. తెలంగాణ జౌళి బోర్డ్ కి సంబంధించిన ఆస్తులన్నిటినీ కోల్ కతా బోర్డ్ కు బదలాయించాలని ఆదేశించింది కేంద్రం.

జౌళి బోర్డ్ తో ఉపయోగం ఏంటి..?

జాతీయ స్థాయిలో పనిచేసే సంస్థల కేంద్ర కార్యాలయాలతోపాటు, ప్రాంతీయ కార్యాలయాలు ఉన్న రాష్ట్రాల్లో పనులు త్వరగా జరుగుతాయి. అందుకే ఆయా కార్యాలయాలకోసం రాష్ట్రాలు పట్టుబడుతుంటాయి. తెలంగాణ రాష్ట్ర జ్యూట్ అవసరాలకు, ఇక్కడి జనపనార ఉత్పత్తులు, పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రాంతీయ కార్యాలయం ఉపయోగపడుతోంది. ఇటీవల తెలంగాణలో వరి దిగుబడి పెరిగిన నేపథ్యంలో ధాన్యం సంచులు పెద్ద ఎత్తున అవసరం అవుతున్నాయి. వీటన్నంటిని కోల్ కతా నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జనపనార మిల్లులను తెలంగాణలో స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలివ్వడంతో, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఐదు ప్రాంతాల్లో జనపనార మిల్లులకు అనుమతులిచ్చారు. ఆయా సంస్థలతో ఒప్పందాలు ఖరారయ్యాయి. వాటికి ప్రోత్సాహకాలు, రాయితీలు కూడా ప్రకటించారు. వీటన్నిటికీ అనుమతులు సకాలంలో రావడానికి జౌళి బోర్డ్ తెలంగాణలో ఉండటమే కారణం. ఇప్పుడది కోల్ కతాకు తరలిపోతే.. తెలంగాణకు ఇబ్బందులు తప్పవు.

కొత్తవి ఇవ్వరు, ఉన్నవి తీసుకెళ్తారు..

విభజన చట్టంలోని కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి ఇప్పటి వరకు దిక్కులేదు..

పసుపు బోర్డ్ ఇస్తామని చెప్పిన కాకమ్మ కథలకు న్యాయం జరగలేదు.

హైదరాబాద్ లో ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఇచ్చినట్టే ఇచ్చి గుజరాత్ కి తరలించారు..

చెప్పుకుంటూ పోతే తెలంగాణపై కక్షతో, వివవక్షతో కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిన పాపాలు చాలానే ఉన్నాయి. అందులో జనపనార బోర్డ్ కొత్తగా చేరింది. జనపనార బోర్డ్ ని కోల్ కతా కు తరలించి మరోసారి కేంద్రం మోసం చేసింది. కొత్తవి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు, అదే సమయంలో ఉన్నవి ఊడబీకేస్తూ మరో దారుణానికి పాల్పడుతున్నారు కేంద్రంలోని బీజేపీ నేతలు. వీటన్నిటికీ బదులు చెప్పే సమయం వచ్చిందని అంటున్నారు తెలంగాణ నేతలు. కనీసం తెలంగాణలోని బీజేపీ నేతలైనా ఈ వివక్షపై తమ గళం వినిపిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News