చలో మేడిగడ్డ.. కమిటీ రెడీ

బ్యారేజీలను పరిశీలించి, పిల్లర్ల కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది ఎన్డీఎస్ఏ.

Advertisement
Update:2024-03-03 17:25 IST

మేడిగడ్డ వ్యవహారంపై ఎట్టకేలకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఓ కమిటీని నియమించింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన, అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా ఈ కమిటీ ఏర్పాటైంది. యూసీ విద్యార్థి, ఆర్‌ పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌ ఇందులో ఇతర సభ్యులు. మూడు బ్యారేజ్ ల వ్యవహారంపై ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది.

గతేడాది నవంబర్ లో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన తర్వాత ఈ వ్యవహారం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో.. కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణ జరపాలంటూ ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలపై నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ లేఖపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది.

బ్యారేజీలను పరిశీలించి, పిల్లర్ల కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది ఎన్డీఎస్ఏ. 4 నెలలలోగా రిపోర్టును అందజేయాలని కమిటీకి గడువు విధించింది.

Tags:    
Advertisement

Similar News