నమ్మండి ప్లీజ్.. ఫామ్ హౌస్ లో సామ్రాజ్య లక్ష్మి పూజ
ఫాంహౌస్ లో కేవలం పూజలు చేయడానికే తాము వెళ్లామని చెబుతున్నారు నందకుమార్. సింహయాజులు స్వామిజీ తో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికే తాము అక్కడకు వచ్చామని, ఈలోగా పోలీసులు వచ్చి సోదాలంటూ తమని తీసుకెళ్లారని చెప్పారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందనే విషయంలో ఇప్పటికే ప్రజలకు ఓ క్లారిటీ వచ్చేసింది. బేరసారాలు బెడిసికొట్టడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అక్కడికి వచ్చినవారంతా బీజేపీ నేతలకు దగ్గరివారే కావడంతో ముసుగు తొలగించాల్సిన పని లేకుండానే విషయం తేలిపోయింది. కానీ నగదు దొరకలేదన్న కారణంతో ముగ్గురు నిందితుల్ని రిమాండ్ కి పంపించడానికి నిరాకరించారు న్యాయమూర్తి. దీంతో పోలీసులు ఈరోజు నోటీసులిచ్చి వారిని విచారణకు పిలిపిస్తున్నారు. ముగ్గురిలో ఒకరైన నందకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ లో కేవలం పూజలు చేయడానికే తాము వెళ్లామని చెబుతున్నారు నందకుమార్. సింహయాజులు స్వామిజీ తో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికే తాము అక్కడకు వచ్చామని, ఈలోగా పోలీసులు వచ్చి సోదాలంటూ తమని తీసుకెళ్లారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. స్కామ్ ఏంటి..? అసలు ఏ స్కాం జరిగిందో మాకు తెలియదు..? అంటూ బుకాయించారు నందకుమార్. తాము న్యాయాన్ని నమ్ముతున్నామని, న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని చెప్పారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు నందకుమార్.
ఎవరీ నందకుమార్.. ?
నందకుమార్ అనే వ్యక్తి హోటల్ నిర్వాహకుడు. గతంలో కిషన్ రెడ్డి చేతుల మీదుగా అనేక హోటళ్లు ప్రారంభించారు. అన్నగారిది లక్కీహ్యాండ్ అంటూ నందకుమార్, కిషన్ రెడ్డి ని ఓ రేంజ్ లో పొగుడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అక్కడున్న స్వామీజీలతో కూడా సత్సంబంధాలున్నాయి. దీంతో దీని వెనక కిషన్ రెడ్డి ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పైగా పోలీసులకు అక్కడేం పని, ఎమ్మెల్యేలకు ఇష్టమున్న పార్టీలో ఉంటారంటూ కిషన్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా సంచలనంగా మారాయి. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో అసలు బేరసారాలే లేవని, పూజలకోసం ఫామ్ హౌస్ కి వచ్చామంటూ నందకుమార్ చెప్పిన డైలాగులే హైలెట్ అంటున్నారు నెటిజన్లు.