ఘటనా స్థలానికి మంత్రులు.. అగ్ని ప్రమాద బాధితులకు పరిహారం

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. అపార్ట్ మెంట్స్ లో కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచడం ప్రమాదకరం అని అన్నారు.

Advertisement
Update:2023-11-13 14:11 IST

నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకి ఆదేశిస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్‌. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అపార్ట్ మెంట్స్ లో కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచడం ప్రమాదకరం అని అన్నారు కేటీఆర్.

అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటని ఆరా తీస్తున్నారు పోలీసులు. కారు రిపేర్ సమయంలో మంటలు వచ్చాయని, ఆ తర్వాత కెమికల్ డ్రమ్ముల కారణంగా పెద్ద ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారించారు. షార్ట్ సర్క్యూట్ లేదా, టపాసుల వల్ల మంటలు వ్యాపించాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు.

ఒకే కుటుంబంలో ఏడుగురు..

ఈ ప్రమాదంలో మొత్తం 9మంది మృతి చెందారు. రోజుల వయసున్న పసిబిడ్డ, ఇద్దరు మహిళలు కూడా మృతి చెందడం ఆందోళన కలిగించే అంశం. రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మొత్తం నాలుగు అంతస్తులున్న ఈ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం కారణంగా 21మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారకస్థితిలో ఉన్నారు. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News