నమో అంటే నమ్మించి మోసం చేయడం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలు జాతీయ స్థాయిలో అధికార మార్పు కోరుకుంటున్నారు. కేవలం రాష్ట్ర ప్రజలదే కాకుండా దేశ ప్రజలందరి కోరిక ఇదే అని కేటీఆర్ అన్నారు.
నమో అంటే నమ్మించి మోసం చేయడమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. పసుపు బోర్డు ఏర్పాటు, గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పడంపై హామీలు గుప్పించారు. గతంలో ఈ హామీలన్నీ ఇచ్చినా.. మరోసారి పాలమూరులో జరిగిన సభా వేదికగా ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు.
తెలంగాణ ప్రజలు జాతీయ స్థాయిలో అధికార మార్పు కోరుకుంటున్నారు. కేవలం రాష్ట్ర ప్రజలదే కాకుండా దేశ ప్రజలందరి కోరిక ఇదే అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉన్నది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. కిసాన్ సమ్మాన్ పేరుతో రైతులకు నామ మాత్రమే ఇచ్చారు. కానీ చిన్న రాష్ట్రమైన తెలంగాణ 70 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లోకి వేసిందని చెప్పారు.
తెలంగాణలో రైతు రుణమాఫీ జరగనే లేదని ప్రధాని మోడీ మాట్లాడటం మిలియన్ డాలర్ జోక్‌గా కేటీఆర్ అభివర్ణించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండు సార్లు రైతుల రుణ మాఫీకి నడుం భిగించిందని అన్నారు. ఇలాంటి ఏకైక సందర్భంగా తెలంగాణలో మాత్రమే ఆవిష్కృతమైందని చెప్పారు. అన్నదాతల అప్పులు మాఫీ చేసిన రైతు ప్రభుత్వం మాదే అని పునరుద్ఘాటించారు.
కార్పొరేట్ దోస్తులకు రూ.14.5 లక్ష కోట్ల మేర రుణాలను రద్దు చేసిన రైతు వ్యతిరేక ప్రభుత్వం మీది. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతు హంతక రాజ్యం మీదని ప్రధాని మోడీని కేటీఆర్ దుయ్యబట్టారు. పదేళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా పాతరేసి.. మీ ఎన్నికల హామీలను కూడా గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లేదితే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలోని ప్రాజెక్టుల వల్ల చుక్క నీళ్లు రావడం లేదని అనడం మీ అవివేకానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు సాగునీటి విప్లవం సాగుతోంది. మా రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా ఇక్కడి ప్రాజెక్టుల గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలు ఇప్పటికీ తెలంగాణ రైతులు మరచిపోలేదని అన్నారు.
మీరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ఇక్కడ ఏమీ నడవదు. తెలంగాణలో బీజేపీకి నూకలు ఎప్పుడో చెల్లిపోయాయని అన్నారు. నిన్న కాళేశ్వరం అయినా నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగు నీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలుగా నిలిచాయని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు భవిష్యత్ సాగునీటి రంగానికే సరికొత్త పాఠాలు బోధిస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్టులపై మీ ఆరోపణలు అన్నీ పూర్తిగా అవాస్తవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.