ఫస్ట్ లిస్టు నుంచి పేర్లు మిస్.. తుమ్మల, పొంగులేటి, మధు యాష్కి, పొన్నం..

ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పక్కన పెట్టి మరీ.. ఇటీవలే పార్టీలో చేరిన తండ్రి కొడుకులు మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్‌లకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం గమనార్హం.

Advertisement
Update:2023-10-15 10:10 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను ఆదివారం ఏఐసీసీ విడుదల చేసింది. 70 సీట్ల వరకు ప్రకటిస్తారని చెప్పినా.. చివరకు 55కే పరిమితం చేశారు. తొలి జాబితా చూడగానే.. కాంగ్రెస్ మార్క్ రాజకీయం స్పష్టంగా తెలిసిపోయింది. బీఆర్ఎస్‌ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఏడుగురికి తొలి జాబితాలోనే టికెట్లు కేటాయించారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పక్కన పెట్టి మరీ.. ఇటీవలే పార్టీలో చేరిన తండ్రి కొడుకులు మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్‌లకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం గమనార్హం.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు, భార్యాభర్తలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డికి కూడా టికెట్లు కేటాయించారు. వీరి విషయంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ వర్తించదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 5 ఏళ్లకు పైగా పార్టీలో యాక్టీవ్‌గా ఉంటే కుటుంబం సభ్యులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఉత్తమ్, ఆయన భార్యకు టికెట్లు ఖరారు చేశారు. కాగా, తొలి జాబితాలో కీలకమైన కొన్ని పేర్లు మిస్ అయ్యాయి. దానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఖమ్మం, పాలేరు అభ్యుర్థుల పేర్లు తొలి జాబితాలో కనపడలేదు. కొన్ని రోజుల క్రితమే పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇక పొంగులేటి కూడా పాలేరు లేదా కొత్తగూడెం కావాలని కోరుతున్నారు. అయితే పలు సర్వేలు పరిశీలించిన అధిష్టానం ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరింది. దానికి ఆయన ససేమిరా అని అన్నట్లు తెలిసింది. శనివారం ఢిల్లీకి తుమ్మలను పిలిపించుకున్న రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ఆయనకు సర్థి చెప్పారని.. దీంతో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రోజు తొలి జాబితాలో ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటికి టికెట్లు ఉంటాయని అందరూ అంచనా వేశారు. కానీ వారిద్దరి పేర్లు కనిపించక పోవడంతో అక్కడ సయోధ్య జరగనట్లే కనిపిస్తున్నది.

హుస్నాబాద్ టికెట్‌ను పొన్నం ప్రభాకర్, అలిగిరి ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నారు. బీసీలకే ఆ టికెట్ కేటాయించాలని పొన్నం అధిష్టానం వద్ద కూడా డిమాండ్ చేశారు. కాగా, వామపక్షాలతో పొత్తు ఉంటే హుస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించే అవకాశం ఉన్నది. అందుకే ఆ టికెట్‌పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక ఎల్బీనగర్ టికెట్‌ను మధు యాష్కి కోరుతుండగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జక్కిడి ప్రభాకర్, మల్‌రెడ్డి రాంరెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. బీసీలకే ఎల్బీనగర్ టికెట్ కేటాయించాలని మధు యాష్కి పట్టుబడుతున్నారు. దీంతో ప్రస్తుతానికి ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు.

Tags:    
Advertisement

Similar News