ఆపరేషన్ జీహెచ్ఎంసీ.. మైనంపల్లి వర్సెస్ కేటీఆర్
గతంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తాజాగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయి నుంచి దెబ్బకొట్టడానికి అన్ని అవకాశాలనూ వాడుకుంటోంది. నగరపంచాయతీలు, మున్సిపాల్టీల్లో అవిశ్వాస తీర్మానాలతో వాటిని హస్తగతం చేసుకంటూ వస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా రాజధాని జీహెచ్ఎంసీపైనే గురిపెట్టింది. తమకు బలం లేకపోయినా ఆపరేషన్ జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు లీడ్ చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నుంచి స్వయానా కేటీఆర్ రంగంలోకి దిగారు.
బాబా ఫసియుద్దీన్‌తో మొదలుపెట్టారు
గతంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తాజాగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆపరేషన్ జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ దీంతో బోణీ కొట్టిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లందరికీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. తనకు కార్పొరేటర్లతో ఉన్న వ్యక్తిగత పరిచయాలను దీనికి ఉపయోగించుకుంటున్నారు. తమకు బలం లేకపోయినా బీఆర్ఎస్‌ను ఆగం చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం.
కార్పొరేటర్లతో కేటీఆర్ మీటింగ్
ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్లను కాపాడుకోవడానికి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ రోజు బీఆర్ఎస్ భవన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమవుతున్నారు.