రాజకీయాల్లో నువ్వో, నేనో.. హరీష్ రావుకు మైనంపల్లి సవాల్
రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ హరీష్‌కు ఛాలెంజ్ చేశారు. హరీష్ రావు మళ్లీ గెలవడం కష్టమన్న మైనంపల్లి.. హరీష్ రావు గెలిస్తే తాను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయనంటూ సవాల్ విసిరారు.
సిద్దిపేటలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి వెనుక మైనంపల్లి హన్మంతరావు ఉన్నారనే ప్రచారం జరిగింది. రైతు రుణమాఫీ చేశాం కాబట్టి రాజీనామా చేయాలంటూ హరీష్ రావు టార్గెట్‌గా మైనంపల్లి అభిమానులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా మరోసారి సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ ర్యాలీగా వెళ్లారు మైనంపల్లి హన్మంత రావు. ఈ సందర్భంగా హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు. రాజకీయాల్లో హరీష్ రావో, తానో ఎవరైనా ఒక్కరే ఉండాలన్నారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ హరీష్‌కు ఛాలెంజ్ చేశారు. హరీష్ రావు మళ్లీ గెలవడం కష్టమన్న మైనంపల్లి.. హరీష్ రావు గెలిస్తే తాను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయనంటూ సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి హరీష్ రావు వర్సెస్ మైనంపల్లి అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి తనకు మల్కాజ్‌గిరి, కొడుకు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు మైనంపల్లి. మైనంపల్లికి మల్కాజ్‌గిరి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ హైకమాండ్, రోహిత్‌కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తన కొడుక్కి టికెట్ నిరాకరించడానికి కారణం హరీష్ రావేనని మైనంపల్లి ఆరోపించారు. హరీష్ రావు టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు. తర్వాత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోగా.. మెదక్‌లో ఆయన కుమారుడు రోహిత్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై విజయం సాధించారు.