కోమటిరెడ్డి, ఈటలకు హైకమాండ్ పిలుపు.. బండి సంగతేంటి..?

తెలంగాణలో బీజేపీ ఒకటీ రెండు విజయాలకు బండి సంజయ్ అస్సలు ఏమాత్రం కారణం కాదనేది ఓ వర్గం వాదన. సంజయ్ వల్ల పార్టీకి నష్టమే కాని లాభం లేదని, ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు పరోక్షంగా ధ్వజమెత్తారు.

Advertisement
Update:2022-11-15 14:32 IST

మునుగోడు పరాజితుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారిద్దరూ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మునుగోడు ఓటమి విశ్లేషణ కోసం రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ పిలిచిందని అనుకున్నా మధ్యలో ఈటలతో పనేంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పోనీ ఈటలతోపాటు మిగతా ఎమ్మెల్యేలను పిలిచినా దానికో అర్థముంది. అందులోనూ అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పిలుపు లేకపోవడం ఇక్కడ మరో విశేషం.


సంజయ్ బీజేపీకి బలమా, బలహీనతా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం కసరత్తులు చేస్తున్న హైకమాండ్ వ్యూహ, ప్రతివ్యూహాలతో బిజీగా ఉంది. అయితే బండి సంజయ్ తో ఈ వ్యవహారం వర్కవుట్ అవుతుందా లేదా అనేది మాత్రం అనుమానమే. తెలంగాణలో బీజేపీ ఒకటీ రెండు విజయాలకు బండి సంజయ్ అస్సలు ఏమాత్రం కారణం కాదనేది ఓ వర్గం వాదన. సంజయ్ వల్ల పార్టీకి నష్టమే కాని లాభం లేదని, ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు పరోక్షంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయాలంటే ఈ రాజకీయం సరికాదని, ఈ నాయకత్వంతో పని కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ దశలో అధిష్టానం బండి సంజయ్ ని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టిందా అనేది తేలాల్సి ఉంది.

ఈటలతోనూ కష్టమే.. కానీ..?

పార్టీనుంచి తాను బయటకొస్తే తన వర్గం మొత్తం టీఆర్ఎస్ ని వీడుతుందని ఈటల కలగన్నారు. కానీ అది నిజం కాలేదు. దీంతో ఈటల అసలు బలమేంటో అధిష్టానానికి తెలిసొచ్చింది. ఈటలకు పెత్తనం అప్పగించే ఉద్దేశం బీజేపీ అధిష్టానానికి ఉందో లేదో కానీ, ఆయన మాత్రం బండి సంజయ్ కి పోటీదారుగా మారబోతున్నారు. ఇద్దరూ బీసీలే కావడం ఇక్కడ ఆధిపత్య పోరాటానికి మరో కారణం. మొత్తమ్మీద రాజగోపాల్ రెడ్డితో ఈటల ఢిల్లీకి వెళ్లడం, ఇక్కడ బండి వర్గంలో గుబులు రేపుతోంది. వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణ నాయకత్వంలో మార్పులు ఉంటాయా లేదా అనేది ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News