Munugode Bypoll Result: ఓట్ల లెక్కింపు పూర్తవకుండానే ఓటమిని అంగీకరించిన రాజగోపాల్ రెడ్డి
Munugode Bypoll Result: మునుగోడు ఉప ఎన్నికలో తన ఓటమిని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు. ఓట్ల లెక్కింపు పూర్తవకుండానే ఆయన టీఆరెస్ గెలిచినట్టు ఒప్పుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే...13వ రౌండ్ పూర్తవకముందే...మరో రెండు రౌండ్ లు మిగిలి ఉండగానే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. టీఆరెస్ విజయాన్ని అంగీక రించారు.
13 వ రౌండు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే రాజగోపాల్ రెడ్డి బైటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అధర్మ యుద్దంలో అధర్మమే గెలిచిందని ఆయన అన్నారు. ''పోలీసులు ఏకపక్షంగా టీఆరెస్ కు సహకరించారు. డబ్బు, మధ్యం పంపకాలు చేశారు. వంద మంది ఎమ్మెల్యేలను మోహరించారు. మునుగోడు ప్రజలు టీఆరెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రజలు నా వైపే ఉన్నారు. 1వ తేదీ సాయంత్రం నుంచి టీఆరెస్ ఎమ్మెల్యేలందరూ మోహరించి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు బెధిరించారు. ఒక వ్యక్తిని ఓడించేందుకు100 మంది ఎమ్మెల్యేలు మోహరించారు.'' అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
''నేను గట్టిపోటీ ఇచ్చాను. నైతికంగా నేనే గెలిచాను. పేద ప్రజల బలహీనతను అడ్డుపెట్టుకొని ప్రలోభాలు పెట్టి ఓట్లేయించుకున్నారు. పెన్షన్ కట్ అవుతుందని బెదిరించారు. నేను ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన నా పోరాటం కొనసాగుతుంది. నా గెలుపుకు కృషి చేసిన వారికి, ఓటర్లకు కృతఙతలు.'' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.