తెలంగాణలో ఈ గ్రామం.. దేశానికే ఆదర్శం..

ఆదర్శ గ్రామాల అభివృద్ధికి తెలంగాణలోని ముఖరా-కె ఓ నిదర్శనం, దేశానికే ఆదర్శం అని అన్నారాయన. వినూత్న సృజనాత్మక ఆలోచనలు చేస్తున్న గ్రామ పరిపాలకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, ప్రజలకు అభినందనలు అంటూ మంత్రి ఎర్రబెల్లి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Update:2022-09-05 12:45 IST

ముఖరా-కె. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే అవార్డులు, రివార్డులు ఈ గ్రామానికి సొంతమయ్యాయి. పచ్చదనం, పరిశుభ్రత.. ఇలా రకరకాల కేటగిరీల్లో ఈ గ్రామం దేశంలోనే ముందు వరుసలో ఉంది. తాజాగా.. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ గ్రామం గురించి ట్వీట్ చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ లోగోని ప్రభుత్వ భవనాల గోడల మీద ఆవిష్కరించడంలో ముఖరా-కె గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ అలంకరణ దేశానికి గొప్ప సంకల్పాన్ని అందిస్తోందని పేర్కొంది. దీన్ని రీట్వీట్ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ముఖరా-కె ఇప్పటికే అనేక మైలురాళ్లను అధిగమించిందని, ఇది మరో మైలురాయి అని చెప్పారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధికి తెలంగాణలోని ముఖరా-కె ఓ నిదర్శనం, దేశానికే ఆదర్శం అని అన్నారాయన. వినూత్న సృజనాత్మక ఆలోచనలు చేస్తున్న గ్రామ పరిపాలకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, ప్రజలకు అభినందనలు అంటూ మంత్రి ఎర్రబెల్లి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ముఖరా-కె ఎందుకంత స్పెషల్..

 500మంది జనాభా, 300 గడప.. క్లుప్తంగా ఇదీ ముఖరా-కె గ్రామ ముఖచిత్రం. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంది. అదనంగా గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. తెలంగాణలోనే మొదటి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామం ఇది.

♦ మూడేళ్లుగా గ్రీన్‌ ఛాలెంజ్‌ లో భాగంగా గ్రామ పరిధిలో 40 వేల మొక్కలు నాటారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ పచ్చదనం కనిపిస్తుంది.

♦ కొత్తగా పెళ్లైన ప్రతి జంట, తమ ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలనే సంప్రదాయం ఇక్కడ ఉంది. ఇక్కడి పల్లె ప్రకృతి వనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది.

♦ డిజిటల్‌ లిటరసీలో ముఖరా-కె జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.

♦ వందశాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతాయిక్కడ. పేటీఎం, స్వైపింగ్‌ మిషన్ల ద్వారా డబ్బులు ఖాతాల నుంచి బదిలీ చేస్తారు. అందరికీ రూపే కార్డులున్నాయి. 2016లో పెద్దనోట్ల రద్దుతో దేశమంతా ఇబ్బంది పడినా ముఖరా-కె ప్రజలు మాత్రం డిజిటల్ పేమెంట్స్ కి అలవాటుపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సశక్త్ చాయత్ సతత్ వికాస్ పేరుతో ఆయా లోగోలను గ్రామ పంచాయతీ భవనాల ప్రహరీ గోడలపై చిత్రీకరించారు. ఊరంతా ఉన్న ఈ పెయింటింగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో విరామం లేని నిరంతర పంచాయతీ అభివృద్ధి, బలమైన పంచాయతీ, సుస్థిరమైన అభివృద్ధి అనే ట్యాగ్‌ లైన్‌ లను ఈ పెయింటింగ్స్ కి జత చేశారు. కేంద్రం దృష్టిని కూడా ఈ పెయింటింగ్స్ ఆకర్షించాయి. ముఖరా-కె గ్రామ సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ గాడ్గే, వార్డు సభ్యులు, సిబ్బంది, అధికారులు, ప్రజలకు జాతీయస్థాయిలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News