లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన ఎంపీ ఈటల
వికారాబాద్ ఘటనపై జాతీయ మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసినట్లు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
వికారాబాద్ ఘటనపై జాతీయ మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసినట్లు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఫార్మా సిటీ విషయంలో రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పాల్లొన్న వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దూమారం రేగుతోంది. దీనిపై ఎంపీ ఈటల ట్విట్టర్ వేదికగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని, ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు.
దీనిపై వెంటనే ఎన్‌హెచ్ఆర్సీ బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. దీనిపై కమీషన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ఈటల రాసుకొచ్చారు. మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వికారాబాద్ జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా మంగళవారం బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు చించివేశారు. మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా షా, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిస్సి, గీత సహా పలువురిపై దాష్టీకానికి పాల్పడ్డారు.