జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్‌పై సినీ ప్రముఖుల కన్ను?
జూబ్లీహిల్స్ టికెట్‌ను నితిన్ ఆశించడం లేదు. కానీ తన అక్క నికితారెడ్డికి రాజకీయాల పట్ల ఇంట్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఎంతో మంది సినీ నటులు, ప్రముఖులు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. సినిమాలో సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలను ఓట్లుగా మల్చుకొని రాజకీయ పదవులు అనుభవించారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా నటుల ప్రభావం బాగానే ఉన్నది. ఈ క్రమంలో పలువురు నటులను, సెలెబ్రిటీలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా మరిన్ని సీట్లు గెలుచుకునే వ్యూహం రచిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇటీవల వరుసగా సెలబ్రిటీలతో భేటీ అవుతోంది. ఢిల్లీ నుంచి ఏ అగ్రనాయకుడు హైదరాబాద్ వచ్చినా.. కనీసం ఒక సినిమా నటుడిని అయినా కలవకుండా పోవడం లేదు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తరచూ హైదరాబాద్ వస్తున్న బీజేపీ అగ్రనాయకులు సెలబ్రిటీలతో మంతనాలు జరుపుతున్నారు. బయటకు మామూలు భేటీలా కనపడుతున్నా.. అక్కడ రాజకీయ చర్చలే జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
కొన్ని రోజుల క్రితం బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను సినీ నటుడు నితిన్ కలిశారు. ఆ భేటీ అనేక చర్చలకు దారి తీసింది. ఏ మాత్రం క్రేజ్ లేని, ఫ్లాప్ సినిమా నటుడిని నడ్డా ఎలా కలిశారనే విషయంలో అనేక వార్తలు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వం కార్తికేయ-2 నటుడు నిఖిల్ బదులు నితిన్‌ను పిలిచారనే చర్చ కూడా జరిగింది. కాగా, అది పొరపాటు భేటీ కాదని.. రాజకీయపరంగా నితిన్‌తో కావాలనే సమావేశం అయ్యారని తెలుస్తున్నది. హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పలువురు సినీ ప్రముఖులు టికెట్లు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఆ టికెట్లు సిట్టింగులకు లేదా గతంలో పోటీ చేసే వాళ్లకు కేటాయించే అవకాశం ఉన్నది. ఇక జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో అనే క్లారిటీ లేదు. దీంతో కొంత మంది కన్ను బీజేపీపై పడింది. జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్‌పై ఇప్పటికే చాలా మంది కన్నేశారు. ఈ క్రమంలోనే జేపీ నడ్డాతో నితిన్ భేటీ అయినట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
జూబ్లీహిల్స్ టికెట్‌ను నితిన్ ఆశించడం లేదు. కానీ తన అక్క నికితారెడ్డికి రాజకీయాల పట్ల ఇంట్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. నితిన్ ఫ్యామిలీ కూడా నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో టచ్ ఉన్న వాళ్లే. అయితే, ఎన్నాళ్లగానో హైదరాబాద్‌లో స్థిరపడటంతో జూబ్లీహిల్స్ సరైన సెగ్మెంట్ అని అనుకుంటున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా కూతురి రాజకీయ ఆంకాంక్షలకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తున్నది. నికితకు టికెట్ కేటాయించడం ద్వారా నితిన్ కూడా ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ ఉండటంతో బీజేపీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. నితిన్ ఫ్యామిలీ కూడా బీజేపీ నాయకత్వంతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారని.. నితిన్ ఫ్యామిలీ అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం.
కాగా, సినీ నటి జీవిత రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆమెను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇక్కడ అయితే ఆమెకు పరిచయాలు ఎక్కువగా ఉంటాయని.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది కూడా ఆమెకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని భావించింది. కానీ, అధినాయత్వం మాత్రం జూబ్లీహిల్స్ నుంచి నితిన్ ఫ్యామిలీ అయితేనే బాగుంటుందని అంచనా వేస్తోంది. తెలంగాణ స్థానికులు కావడం, రెడ్డి సామాజిక వర్గం అండ ఉండటం కలిసొస్తుందని అనుకుంటున్నది. జీవిత కంటే జూబ్లీహిల్స్ నుంచి నికిత అయితే సరైన ఛాయిన్ అని అంచనా వేస్తోంది. మరి బీజేపీ టికెట్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి.