ఎంఓయూ తెచ్చిన తంటా.. కవర్ చేసుకోలేక కాంగ్రెస్ కష్టాలు

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు కంటే, కీడే ఎక్కువగా జరిగే అవకాశముందని అంటున్నారు.

Advertisement
Update:2024-08-09 17:53 IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజీ తేకపోగా.. లేనిపోని చిక్కుల్ని కొని తెచ్చినట్టయింది. స్వచ్ఛ బయో అనే కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి సోదరుడికి చెందిన ఈ కంపెనీతో ఒప్పందం పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని, సీఎం సోదరుడికి లబ్ధి చేకూర్చేలా క్విడ్ ప్రోకో జరిగిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలకు ఎలా సమాధానం చెప్పాలో కాంగ్రెస్ కి అర్థం కావడంలేదు.

అయితే ఏంటి..?

స్వచ్ఛ బయో అనే కంపెనీ రేవంత్ రెడ్డి సోదరిడిది కాదని, ఆయన కేవలం అందులో డైరెక్టర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒకవేళ ఆ కంపెనీ సీఎం సోదరుడిది అయినంత మాత్రాన అక్రమాలు జరిగినట్టు కాదన్నారు. ఆ మాటకొస్తే బీఆర్ఎస్ నేతల కంపెనీలతో కూడా తాము ఎంఓయూ కుదుర్చుకోడానికి సిద్ధమని ప్రకటించారు చామల.


స్వచ్ఛ బయో కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోడాన్ని ఎవరూ తప్పుబట్టట్లేదు కానీ, అమెరికా వెళ్లి మరీ ఆ కంపెనీతో డీల్ ఏంటనేది ప్రతిపక్షం అడుగుతున్న సూటి ప్రశ్న. అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి భాగస్వామ్యం ఉన్నా కూడా దాన్ని ఎందుకు దాచి పెట్టాల్సి వస్తోందని వారు అడుగుతున్నారు. అందుకే క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతున్నారు. ఆ కంపెనీతో సీఎం సోదరుడికి ఉన్న సంబంధాన్ని ముందుగా బయటపెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కవర్ చేసుకోలేక తంటాలు పడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు కంటే, కీడే ఎక్కువగా జరిగే అవకాశముందని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News