ఉదయం కడియంతో.. సాయంత్రం రాజనర్సింహతో.. అసలు రాజయ్య మనసులో ఏముంది..?
సోమవారం సాయంత్రం హన్మకొండలో జరిగిన మాదిగల మేధావుల సదస్సులో కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులతో కలిసి రాజయ్య పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కొంతకాలం ఆయనపై స్థానిక నేతల ఆరోపణలు, ఆ తర్వాత అసెంబ్లీ టికెట్ దక్కలేదని, తర్వాత టికెట్ తనకే దక్కుతుందని ప్రకటనలతో ఆయన వార్తల్లో ఉంటున్నారు. జమిలి ఎన్నికలొస్తాయి.. టికెట్లు మారొచ్చని ఆదివారం ఆశాభావం ప్రకటించిన రాజయ్య.. సోమవారం తన చర్యలతో మరింత హైలైట్ అయ్యారు.
శ్రీహరి పక్కన రాజయ్య
సోమవారం ఉదయం వల్మడిలో రామాలయం ప్రారంభోత్సవంలో కడియం శ్రీహరితో కలిసి వేదిక పంచుకున్నారు రాజయ్య. తనను కాదని కడియంకు టికెట్ ప్రకటించినప్పటి నుంచి అగ్గిమీద గుగ్గిలం అవుతున్న రాజయ్య ఆయనతో కలిసి పక్కపక్కనే కూర్చున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. కలిసి పని చేస్తామన్నట్లు సంకేతాలిచ్చారు. అయితే పార్టీ శ్రేణులు, మీడియా పరిశీలనగా చూస్తుంటంతో ఏమనుకున్నారో ఏమో వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు.
రాజనర్సింహతో ఏకాంత చర్చలు
సోమవారం సాయంత్రం హన్మకొండలో జరిగిన మాదిగల మేధావుల సదస్సులో కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులతో కలిసి రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య, రాజనర్సింహ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్ ఘన్‌పూర్ వదిలేది లేదంటున్న రాజయ్య కాంగ్రెస్ వైపు చూస్తున్నారా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఉదయమే కడియం శ్రీహరితో కలిసి పార్టీ విజయానికి పని చేస్తానన్న రాజయ్య.. సాయంత్రానికే ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతతో మంతనాలు జరపడంతో అసలు ఆయన మనసులో ఏముందో అనేది ఆయన వర్గీయులకే అంతుపట్టడం లేదు.
*