మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం

నమామీ గంగే ప్రాజెక్టుకే రూ.40 వేల కోట్లు.. మూసీకి ఎందుకు రూ.1.50 లక్షల కోట్లు : కేటీఆర్‌

Advertisement
Update:2024-09-30 17:35 IST

మూసీ ప్రాజెక్టు పేరుతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరతీసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సోమవారం మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రాబోయే ఎన్నికల కోసం మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ రిజర్వ్‌ బ్యాంక్‌ లా వాడుకోవాలని చూస్తోందన్నారు. 2,400 కి.మీ.ల పొడవున్న నమామీ గంగే ప్రాజెక్టు కాస్ట్‌ రూ.40 వేల కోట్లు అని, 55 కి.మీ.ల మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఎలా ఖర్చవుతాయో చెప్పాలన్నారు. ఇది స్కాం కాకపోతే ఇంకేమిటని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి మూసీ బాధితుల పాలిట కాలయముడిగా మారారన్నారు. పేదల ఇండ్లు కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా.. సోనియమ్మ చెప్పిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బుల్డోజర్‌ రాజ్‌ అరచకాలు ఆపాలని.. చట్టప్రకారం వెళ్లాలని సూచించిన హైకోర్టుకు ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. మూసీ బాధితులకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ అండగా నిలబడిందన్నారు. ఇచ్చిన హామీల నుంచి పక్కదారి పట్టించేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ కు తెరతీశారన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.. 300 రోజులైనా ఆ హామీల మాట ఎత్తడం లేదన్నారు.

పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఖజానా ఖాళీ అయ్యిందని చెప్తోన్న ప్రభుత్వ పెద్దలు రూ.1.50 లక్షల కోట్లు ఈ ఒక్క ప్రాజెక్టు కోసం ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే పట్టాలిచ్చిందని ప్రజలు చెప్తున్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే వాటిని కూల్చేయడం ఏమిటని ప్రశ్నించారు. అప్పర్‌ మానేరు, మిడ్‌ మానేరులో నిర్వాసితులైన తమ కుటుంబానికి నిర్వాసితుల బాధ తెలుసన్నారు. పేదలు, మధ్య తరగతి వాళ్లకు ఇల్లు అనేది ఒక ఎమోషన్‌ అని, అలాంటి వాళ్ల పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. రేవంత్‌ రెడ్డిలాగా తాము అయాచితంగా, లక్కీ డ్రాలో వచ్చి ఎదగలేదన్నారు. కూల్చివేతలపై 500 మందితో కనుగోలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. 2016లోనే చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ల మ్యాప్‌ లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిందని, అంతకుముందున్న ప్రభుత్వాలు అలాంటి ప్రయత్నమేది చేయలేదన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఇష్టారాజ్యం పర్మిషన్లు ఇచ్చి.. ప్రజలను ఆక్రమణదారులు అనడం దారుణమన్నారు. లక్షలాది మంది జీవితాలను ప్రభుత్వం అంధకారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. దశాబ్దాల క్రితమే అన్ని అనుమతులతో కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తామని ప్రభుత్వం అంటుంది అంటే వ్యవస్థలపై వాళ్లకే నమ్మకం లేనట్టు ఉందన్నారు. కూల్చాల్సి వస్తే హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ లనే మొదట కూల్చివేయాలన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్తోన్న రేవంత్‌ రెడ్డి ఆయన కట్టించిన సెక్రటేరియట్‌ ను కూడా కూల్చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించిన గల్లీల్లో ప్రజల ఆక్రందనలు ఇలాగే ఉంటాయన్నారు. కాళేశ్వరంతో వచ్చే ఆదాయం ఎంత అని గతంలో తమను ప్రశ్నించినోళ్లు.. ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లతో ఎలా మూసీ ప్రాజెక్టు చేపడుతున్నారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే బహుళార్థ ప్రాజెక్ట్ అన్నారు. లక్షల ఎకరాలకు నీళ్లు, హైదరాబాద్ కు తాగునీళ్ల కరవు లేకుండా చేసిందని తెలిపారు. కాళేశ్వరంతో వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌ వన్‌ గా తెలంగాణ నిలిచిందని, మూసీ ప్రాజెక్టుతో మురిసేదెవరో చెప్పాలన్నారు. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కు రూ.7 వేలు, థేమ్స్‌ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఎవరి ప్రయోజనం కోసం రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడుతున్నారో చెప్పాలన్నారు. రేవంత్‌ రెడ్డి మీడియాకు ముఖం చాటేశారని, మంత్రులు మూసీ ప్రాజెక్టుపై మాట్లాడటం లేదన్నారు. ప్రజలు తిడుతుంటే వాళ్ల నోర్లు మూతలు పడ్డాయని, అందుకే అధికారులను ముందు పెడుతున్నారని తెలిపారు. ఇండ్లు కూల్చివేస్తుంటే చిన్న పిల్లలు రోడ్లెక్కి ఏడుస్తున్నారని.. వాళ్లు పైసల కోసమే తిడుతున్నారని ఓ మంత్రి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు మంత్రి శ్రీధర్‌ బాబు అంటే గౌరవం ఉండేదని, ఆయన సహవాస దోషంతో సీఎం మాదిరిగానే చెడిపోయారన్నారు. సీఎంను తిట్టిన తిట్లు ఇంతవరకు వినలేదన్నారు.

ప్రజలు ఆందోళన చెందొందని, హైడ్రా బుల్డోజర్లు వస్తే వాటికి తాము అడ్డుగా నిలబడుతామన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమన్నారు. పేదోళ్లతో పెట్టుకోవడం మంచిది కాదని కాంగ్రెస్‌ పెద్దలు సీఎం రేవంత్‌ రెడ్డికి చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కడుపులు కొట్టొద్దన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే మూసీలో చేరే ప్రతి చుక్క మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించామన్నారు. నాగోల్‌ వద్ద మూసీని సుందరీకరించామని తెలిపారు. మూసీపై 15 బ్రిడ్జిలు మంజూరు చేశామని, రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ బ్యూటిఫికేషన్‌ కు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలన్నారు. ఎస్టీపీలు లేవు కనుక ఇండ్లు కూలగొడుతాం అంటే హైదరాబాద్‌ లో ఒక్క ఇల్లు కూడా మిగలదన్నారు. కొడంగల్‌ లోని రేవంత్‌ ఇల్లు, హైదరాబాద్‌ లో ఆయన ఇల్లు ఎఫ్‌టీఎల్‌ లోనే ఉన్నాయని, ముందు వాటిని కూల్చేయాలని డిమాండ్‌ చేశారు. జంట జలాశయాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ఫాం హౌస్‌లు, ఇండ్లు కూల్చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ది నిర్మాణం.. వికాసం అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వానిది విధ్వంసం అన్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు డీపీఆరే లేదన్నారు. డీపీఆర్‌ లేకుండానే రెడ్‌ మార్కింగ్‌ లు ఎలా చేస్తున్నారని, భూములు, ఆస్తుల సేకరణ చేపట్టాలంటే ప్రజాభిప్రాయం సేకరించాలన్న సంగతి తెలుసా అని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాద్‌ మునిగిపోతుందని రంగనాథ్‌ అంటున్నారని.. వాళ్లు రాకముందు హైదరాబాద్‌ లేదన్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల కింద కట్టిన ఇండ్లు కూల్చుతామంటే ఇది మీ అయ్య జాగీరు కాదన్నారు. మూసీ ప్రవాహ ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడుతామన్నారు. మూసీ రివర్‌ ఫ్రంటా? బ్యూటిఫికేషనా? ఏమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రెస్‌ మీట్‌ లో బీఆర్‌ఎస్‌ నాయకులు తుల ఉమ, కార్తీక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News