తెలంగాణకు రాకముందే విమర్శలు మొదలు పెట్టిన మోదీ
మోదీ ట్వీట్ వైరల్ గా మారడంతో బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కౌంటర్లివ్వడం మొదలు పెట్టాయి. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఆల్రడీ పోస్టర్లు పడ్డాయి. సోషల్ మీడియాలో కూడా మోదీ ట్వీట్ కి అంతే ఘాటుగా బదులిస్తున్నారు నెటిజన్లు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఈరోజు. అయితే నిన్నటినుంచే ఆయన ఈ పర్యటనకోసం బాగా ప్రిపేర్ అవుతున్నట్టు స్పష్టమైంది. పర్యటనకు ఒకరోజు ముందుగానే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్లు వేశారు. కుటుంబ పార్టీలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండిటినీ ఒకే గాటన కట్టాలనే ప్రయత్నం చేశారు. తెలుగులో మోదీ ట్వీట్ వేసి ఆసక్తిని రేకెత్తించినా.. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది.
నేనొస్తున్నా, నిధులు తెస్తున్నా..
మహబూబ్ నగర్ పర్యటనకు వస్తున్న తాను రూ. 13,500 కోట్లకు పైగా నిధులు తెస్తున్నానంటూ మోదీ సెల్ఫ్ డబ్బా బాగానే కొడుతున్నారు. రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నానంటూ ఆయన ట్వీట్ వేశారు.
మోదీ ట్వీట్ వైరల్ గా మారడంతో బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కౌంటర్లివ్వడం మొదలు పెట్టాయి. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఆల్రడీ పోస్టర్లు పడ్డాయి. సోషల్ మీడియాలో కూడా మోదీ ట్వీట్ కి అంతే ఘాటుగా బదులిస్తున్నారు నెటిజన్లు.
వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్.
వలస జిల్లా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యవోయ్...
ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నది మీ అసమర్థ పాలనోయ్ ...
దేశ సంపదను అప్పనంగా అదానీ అంబానీకి దోచిపెడుతున్నది మీరేనోయ్..
దేశమంటే గుజరాత్ ఒక్కటే కాదోయ్..
దేశమంటే దేశ ప్రజలందరోయ్..
అంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గట్టిగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. పాలమూరు ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకుని మోదీ తిరిగి పాలమూరు జిల్లాకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి మోదీ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.