బి-టీమ్ కాదు సి-టీమ్ బీఆర్ఎస్ పై మోదీ తీవ్ర ఆరోపణలు
నా కుటుంబసభ్యులారా అంటూ బీసీ గర్జన సభలో తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు ప్రధాని మోదీ. 'మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను.. మీ ఆశీర్వాదంతోనే త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి తెలంగాణకు సీఎం అవుతారు' అని ధీమా వ్యక్తం చేశారు.
బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కూడా తెలంగాణకు మోసం జరిగిందన్నారాయన. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని, బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ..
నా కుటుంబసభ్యులారా అంటూ బీసీ గర్జన సభలో తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు ప్రధాని మోదీ. 'మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను.. మీ ఆశీర్వాదంతోనే త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి తెలంగాణకు సీఎం అవుతారు' అని ధీమా వ్యక్తం చేశారు. సభకు వచ్చిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. అధికారంలోకి వస్తే పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తామని.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని స్పష్టం చేశారు.
సి-టీమ్
ఇన్నాళ్లూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి-టీమ్ అని కాంగ్రెస్ ఆరోపించింది, కాంగ్రెస్ కే బీఆర్ఎస్ బి-టీమ్ అని బీజేపీ ఆరోపించేది. ఇప్పుడు మోదీ కొత్తగా సి-టీమ్ అనే పల్లవి అందుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలన్నారు మోదీ. బీఆర్ఎస్, కాంగ్రె కి సి-టీమ్ అని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కి సి-టీమ్ అని ఆరోపించారు. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని చెప్పారు. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు మోదీ. కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని అన్నారు మోదీ. ఓబీసీని అయిన తనను ప్రధానిని చేసింది, ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ అని చెప్పారు.