తెలంగాణకు మరోసారి మెండి చెయ్యి చూపించిన మోడీ ప్రభుత్వం

తాజాగా కేంద్రీయ విద్యాలయాల కేటాయింపులో పూర్తి వివక్ష కనపరచింది. ఒక్కటంటే ఒక్క పాఠశాల కూడా రాష్ట్రానికి కేటాయించలేదు.

Advertisement
Update:2023-09-25 17:45 IST

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి వివక్ష చూపించింది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు తెలంగాణకు రావల్సి ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ తొక్కిపెట్టింది. ఇప్పటికే అనేక సార్లు నవోదయ పాఠశాలలను కేటాయించాలని లేఖలు రాసినా.. బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కేంద్రీయ విద్యాలయాల కేటాయింపులోనూ పూర్తి వివక్ష కనపరచింది. ఒక్కటంటే ఒక్క పాఠశాల కూడా రాష్ట్రానికి కేటాయించలేదు.

కేంద్ర విద్యా శాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 20 కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశ్యవాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా... తెలంగాణకు ఒక్కటి కూడా దక్కలేదు.

ఏపీలో ఒక్క బీజేపీ లోక్‌సభ సభ్యుడు కూడా లేడు. అయినా సరే ఆ రాష్ట్రానికి ఏకంగా 8 పాఠశాలలు కేటాయించారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒకరు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కానీ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఒక్క కొత్త కేంద్రీయ విద్యాలయాన్ని కూడా తీసుకొని రాలేకపోయారు. పైగా ఇటీవల కాలంలో హెచ్‌సీయూ పరిధిలోని కేవీని మూసేయాలనే ప్రతిపాదన వచ్చింది. కేంద్ర విద్యా శాఖ కొత్తగా ఏపీకి 8, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాంలకు చెరొకటి, ఛత్తీస్‌గఢ్‌కు 4, గుజరాత్‌కు 3, హిమాచల్‌ప్రదేశ్‌కు 4, జమ్మూ కశ్మీర్‌కు 6 చొప్పున కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది.

ఏ రాష్ట్రంలో ఎక్కడ?

ఆంధ్ర ప్రదేశ్ - అనకాపల్లి, వలసపల్లి (చిత్తూరు జిల్లా), పాలసముద్రం (సత్యసాయి జిల్లా), తాళ్లపల్లి (గుంటూరు), నందిగామ (కృష్ణా జిల్లా), రొంపిచర్ల (పల్నాడు జిల్లా), నూజివీడు (ఏలూరు జిల్లా), డోన్ (నంద్యాల జిల్లా)

అస్సాం - జాగిరోడ్ (మోరిగావ్ జిల్లా)

అరుణాచల్‌ప్రదేశ్ - పిటాపూల్ (లోయర్ సుభాన్సిరి జిల్లా)

ఛత్తీస్‌గఢ్ - ముంగేలి (ముంగేలి జిల్లా), సుర్జాపూర్ (సుర్జాపూర్ జిల్లా), బేమెతారా (బేమెతారా జిల్లా), హసౌద్ (జాన్జ్‌గిర్ చంపా జిల్లా)

గుజరాత్ - చక్కర్‌గఢ్ (అమ్రేలి జిల్లా), ఓగ్నాజ్ (అహ్మదాబాద్ జిల్లా), వీరవాల్ (సోమ్‌నాథ్ జిల్లా)

హిమాచల్‌ప్రదేశ్ - రిరికుతేరా (కంగ్రా జిల్లా), గోకుల్‌నగర్ (ఉనా జిల్లా), నంద్‌పూర్ (ఉనా జిల్లా), తునాగ్ (మండి జిల్లా)

జమ్ము కశ్మీర్ - గోల్ (రంబన్ జిల్లా), రంబన్ (రంబన్ జిల్లా), బాని (కథువా జిల్లా), రామ్‌కోట్ (కథువా జిల్లా), రేసీ (రేసీ జిల్లా), కాట్రా (రేసీ జిల్లా)

Tags:    
Advertisement

Similar News