మోదీ, అమిత్ షా.. ఇద్దరి టార్గెట్ అదే

తన ఇల్లు కట్టుకోడానికి తాను ప్రధాని కాలేదని, పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చానని చెప్పారు మోదీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని అన్నారు.

Advertisement
Update:2023-11-26 19:52 IST

ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇద్దరూ తెలంగాణలో పర్యటించారు. పలు సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఒకే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని చెప్పడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరతారని, బీఆర్ఎస్ కి ఓటు వేసినా, కాంగ్రెస్ కి ఓటు వేసినా ఒకటేనని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో అద్భుతాలు జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అన్నారు.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలు బీఆర్ఎస్ ని ఒకేరకంగా టార్గెట్ చేయాలని చూస్తున్నాయి. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉందని కాంగ్రెస్ అంటోంది, లేదు లేదు బీఆర్ఎస్ స్నేహం కాంగ్రెస్ తోనే అని అంటున్నారు బీజేపీ నేతలు. ఈ రోజు తెలంగాణలో పర్యటించిన మోదీ, అమిత్ షా ఇద్దరూ పదే పదే ఇదే విషయాన్ని చెప్పడం విశేషం. ములుగు, భువనగిరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. నిర్మల్ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పై వీరిద్దరూ విమర్శలు ఎక్కుపెట్టారు.

కేంద్రం ఇచ్చిన పథకాలను కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు ప్రధాని మోదీ. తన ఇల్లు కట్టుకోడానికి తాను ప్రధాని కాలేదని, పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చానని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు అమిత్ షా. దేశంలో అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీలోనే ఉన్నారని చెప్పారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు అమిత్ షా.


Tags:    
Advertisement

Similar News