ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్.. తెలంగాణలో ఆసక్తికర ఘట్టం

ప్రమాణ స్వీకారం గురించి అసలు తనకు సమాచారమే లేదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తనకు సమాచారం ఇవ్వకుండానే కోదండరాం, అమీర్ అలీఖాన్ కౌన్సిల్ హాల్ కి వచ్చారని ఆయన చెప్పారు.

Advertisement
Update:2024-01-30 08:28 IST

కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసుతో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకార ఘట్టం అనూహ్యంగా వాయిదా పడింది. ప్రమాణ స్వీకారం కోసం వారిద్దరూ సోమవారం ఉదయాన్నే కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు. అయితే వారితో ప్రమాణం చేయించాల్సిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం అక్కడకు రాలేదు. గంటలు గడిచినా మండలి చైర్మన్ ఆఫీస్ కి రాలేదు. దీంతో మీడియాలో హడావిడి మొదలైంది. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం బీఆర్ఎస్ కి ఇష్టం లేదని, ఉద్దేశపూర్వకంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి రాలేదని కాంగ్రెస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి.

గుత్తా వివరణ..

ప్రమాణ స్వీకారం గురించి అసలు తనకు సమాచారమే లేదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తనకు సమాచారం ఇవ్వకుండానే కోదండరాం, అమీర్ అలీఖాన్ కౌన్సిల్ హాల్ కి వచ్చారని ఆయన చెప్పారు. అనారోగ్యం కారణంగానే తాను రాలేకపోయానని, ఆ విషయాన్ని కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు గుత్తా. మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తానని ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్సీల ఎంపిక విషయంలోనే పెద్ద రాద్ధాంతం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై పక్కనపెట్టారు. గవర్నర్ కోటా కావడంతో ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురాలేకపోయింది. ఈలోగా ఎన్నికలొచ్చాయి, బీఆర్ఎస్ ఓటమితో ఆ రెండు సీట్లు కాంగ్రెస్ పరం అయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన లిస్ట్ కి ఏమాత్రం వంకలు పెట్టకుండా ఆమోదించారు గవర్నర్. రాజకీయ పార్టీ అధ్యక్షుడైన కోదండరాంను ఎలా ఎంపిక చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నించారు. కానీ అటువైపు నుంచి సమాధానం లేదు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. తీరా ప్రమాణ స్వీకారం విషయంలో కూడా రాజకీయ రచ్చ జరగడం విశేషం. కమ్యూనికేషన్ గ్యాప్ తో కోదండరాం, అమీర్ అలీఖాన్.. కౌన్సిల్ హాల్ లో కొన్నిగంటలు వేచి చూసి, చివరకు వెనుదిరిగారు. 

Tags:    
Advertisement

Similar News