ఎమ్మెల్సీ కవిత ఇంట్లో అభివృద్ధి సమావేశాలు..

మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు షకీల్, గణేష్ తో చర్చించారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యేలు కూడా కవితను కలిశారు.

Advertisement
Update:2023-07-25 19:47 IST

హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఇల్లు ఈరోజు సందడిగా మారింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమె ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు కవిత. బోధన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, వాటికోసం నిధుల మంజూరు వంటి అంశాలపై కవితతో ఎమ్మెల్యే షకీల్ చర్చించారు. రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధి పై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనల గురించి వివరించారు.

మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు షకీల్, గణేష్ తో చర్చించారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యేలు కూడా కవితను కలిశారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతిపాదనలు సమర్పించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, కవితతో భేటీ అయ్యారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదన చారి నేతృత్వంలో విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పెద్దలు కూడా ఎమ్మెల్సీ కవితతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఆ సామాజిక వర్గానికి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన నిధుల గురించి, చేపట్టిన కార్యక్రమాల గురించి కవిత వారికి తెలియజేశారు. సమస్యలుంటే చెప్పాలని, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నిజామాబాద్ కి చెందిన ఆటో డ్రైవర్లు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ కవితను కలిశారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు.. కవితను కలిసి వినతి పత్రం అందించారు. వారి విజ్ఞప్తులకు ఆమె సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News