ఈడీ రిమాండ్ రద్దుచేయాలి.. సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్
తన అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించారని, చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారని, ఈ అరెస్టు చట్టబద్ధం కాదని, ఈడీ అధికారులు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని రిట్ పిటిషన్లో పేర్కొన్నారు కవిత.
ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తన అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించారని, చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారని, ఈ అరెస్టు చట్టబద్ధం కాదని, ఈడీ అధికారులు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని రిట్ పిటిషన్లో పేర్కొన్నారు కవిత. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం మహిళల అరెస్ట్ విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారని కూడా ఆరోపించారు. అందువల్ల ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలన్నారు. ఈడీ కస్టడీ నుంచి వెంటనే కవితను విడుదల చేయాలని ఆమె తరపు న్యాయవాదులు కోరారు.
పాత పిటిషన్ ఉపసంహరణ..
ఇక ఇదే కేసులో గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కవిత ఈరోజు వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని భావించి ఉప సంహరించుకున్నట్లు ఆమె తరఫు లాయర్లు తెలిపారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ పిటిషన్ పై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు వాయిదా ఉండగా.. అప్పటికే కవితను అరెస్ట్ చేయడంతో ఆమె రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
ఇక ఈడీ కస్టడీలో మూడోరోజు అధికారులు కవితకు పలు కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఈ విచారణ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడోరోజు కస్టడీ తర్వాత కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు.