విజన్ ఆఫ్ కేసీఆర్.. ఆకట్టుకునే ఫొటోలు షేర్ చేసిన కవిత
ఏప్రిల్ 30న మన రాష్ట్రం నూతన నిర్మాణాన్ని, రాష్ట్ర ప్రగతి చిహ్నాన్ని ప్రారంభించుకోబోతోంది అంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడింది. ఈనెల 30న సచివాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయానికి తుది మెరుగులద్దుతున్నారు. ఇప్పటి వరకూ సచివాలయం బయటనుంచి ఎలా కనిపిస్తుందనే విషయంలో అందరికీ ఓ అంచనా ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి అయితే సచివాలయం లోపలి నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఓసారి చూడండి అంటూ ఎమ్మెల్సీ కవిత కొన్ని ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. మీడియాలో కూడా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
విజన్ ఆఫ్ కేసీఆర్..
ఏప్రిల్ 30న మన రాష్ట్రం నూతన నిర్మాణాన్ని, రాష్ట్ర ప్రగతి చిహ్నాన్ని ప్రారంభించుకోబోతోంది అంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ సీఎం కేసీఆర్ విజన్ కి ప్రతిరూపం అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఉనికి, ప్రగతి, అభివృద్ధి, ఎదుగుదలకు ఇది పర్యాయపదం అని అన్నారు. సెక్రటేరియల్ లోని వివిధ విభాగాల ఫొటోలను ఆమె షేర్ చేశారు.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ 28 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో నిర్మితమైంది. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఆ మధ్యలో ఇంధ్రభవనంలా సచివాలయం కనిపిస్తుంది. 265 అడుగుల ఎత్తులో, ఆరు అంతస్తులతో, అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. ఇండో పర్షియన్ శైలిలో దీన్ని తీర్చిదిద్దారు.