మహిళా రిజర్వేషన్లపై లండన్‌లో ప్రసంగించనున్న ఎమ్మెల్సీ కవిత

'బ్రిడ్జ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఇందులో కీలకోపన్యాసం చేయడానికి ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు.

Advertisement
Update:2023-10-01 08:27 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన అవకాశం లభించింది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, మహిళా రిజర్వేషన్లపై అక్టోబర్ 6న లండన్‌లో ప్రసంగించడానికి ఆహ్వానం అందింది. మహిళా బిల్లు ఉభయ సభల్లో పాసై, రాష్ట్రపతి ఆమోదంతో ఇప్పుడు చట్ట రూపం దాల్చిన సందర్భంగా.. 'బ్రిడ్జ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఇందులో కీలకోపన్యాసం చేయడానికి ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు.

రాజకీయాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి ఎమ్మెల్సీ కవిత ఎంతగానో కృషి చేశారని సదరు సంస్థ పేర్కొన్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళనలు చేపట్టడమే కాకుండా.. వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో కవిత కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. పలు రకాల కార్యక్రమాలతో మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించారని చెప్పింది.

మహిళా బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 6 వేల మందితో ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 18 పార్టీలకు చెందిన నాయకులు హాజరయినట్లు తెలిపింది. అదే విధంగా ఢిల్లీలో భారత జాగృతి ఆధ్వర్యంలో జరిపిన సమావేశంలో 13 రాజకీయ పార్టీలతో పాటు మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పింది. లండన్‌లో నిర్వహించే సదస్సులో మహిళా బిల్లుతో తన ప్రయాణాన్ని ఎమ్మెల్సీ కవిత కూలంకషంగా వివరిస్తారని.. అలాగే ఆ బిల్లు వల్ల కలిగే లాభాలను కూడా చెప్తారని 'బ్రిడ్జ్ ఇండియా' పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News