సీడబ్ల్యూసీ మీటింగ్ కి ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే, అభివృద్ధి చేసేది మన ప్రభుత్వమే అని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఊహకు అందని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది కాబట్టే ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కరి అవుతున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ పేరుతో నేతలందర్నీ హైదరాబాద్ తీసుకొస్తోందని, ఆ మీటింగ్ కి ముందు తమ ప్రశ్నలకు సోనియా, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ పథకాలకు సరిపోయేవి అమలులో ఉన్నాయా అని ప్రశ్నించారు. పోనీ తెలంగాణకు కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఇంకెక్కడైనా అమలు చేశారా అని అడిగారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. దివ్యాంగులకు 4వేల పెన్షన్ ఇస్తున్నామని ఆ స్థాయిలో దేశంలో ఎక్కడా ఆర్థిక సాయం లేదని తేల్చి చెప్పారామె. మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలన్నారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. కార్యకర్తల సభ మహాసభలా కనిపిస్తోందని చెప్పారు. వేరే పార్టీల సభలన్నీ వెలవెల పోతున్నాయన్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉన్నందువల్లనే నీళ్లు నిధులు నియామకాల్లో రాష్ట్రం నెంబర్-1 గా ఉందన్నారు కవిత. కేసీఆర్ చరిత్ర సృష్టించారని, ఇప్పుడు ఆ చరిత్ర నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ఆల్రడీ పోడు పట్టాలిచ్చిన తర్వాత, రాహుల్ గాంధీ పట్టాల గురించి మాట్లాడుతున్నారని, ఆయన అప్ డేట్ కాలేదని ఎద్దేవా చేశారు.
ఊహకు అందని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది కాబట్టే ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కరి అవుతున్నాయన్నారు కవిత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఇదే తనకు చివరి అవకాశం అంటూ జీవన్ రెడ్డి ప్రజల ముందుకొస్తారని, ఈసారి కూడా ఆయన అవే మాటలు చెబుతారని, ఆయన్ను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హైద్రాబాద్ లో కులసంఘాలకు స్థలం ఇచ్చారని, జగిత్యాలలో కూడా ఇవ్వబోతున్నారని, అలాంటి నాయకుడినే మరోసారి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
వచ్చేది మనమే, చేసేది మనమే..
తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే, అభివృద్ధి చేసేది మన ప్రభుత్వమే అని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.సంజయ్ ని మళ్లీ గెలిపిస్తే అల్లీపూర్ ని మండలం చేస్తామన్నారు. తెలంగాణ అంటే ఇప్పుడు విజయగాధ అని, మళ్ళీ జగిత్యాలలో బీఆర్ఎస్ గెలవాలని, చరిత్ర సృష్టించాలని చెప్పారు.