ఆ పార్టీని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది..
సీఎం కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచించేవారు, పనిచేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు కవిత. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా సాకారం చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆ పార్టీ నాయకులు అన్ని రంగులు మార్చుతారని విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అభ్యర్థి సంజయ్ తో కలసి ఆమె రోడ్ షో నిర్వహించారు.
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం అని చెప్పారు కవిత. తెలంగాణను పుట్టించింది కేసీఆర్ అని, రైతు బంధు, బీడీ కార్మికుల పెన్షన్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాల పుట్టుకకు కూడా ఆయనే కారణం అని తెలిపారు. ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తారని, అందుకే ఆయన ‘ఎలక్షన్ గాంధీ’ అయ్యారని సెటైర్లు పేల్చారు. రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమను పంచుతాం) అని హిందీలో అంటే, హిందీ రాని రేవంత్ రెడ్డి రాహుల్ దుకాణ్ అనుకున్నారని, దుకాణం తెరిచి సీట్లన్నీ అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పేరు రేటెంత రెడ్డి అని అన్నారు కవిత.
తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు కవిత. కేంద్రంలో బీజేపీతో ఒక్క అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. 1969లో తెలంగాణ కావాలని అడిగితే 369 మందిని కాంగ్రెస్ కాల్చి చంపిందని, మనల్ని కష్టపెట్టిన వారికి ఓటేస్తే మోసపోతామని అన్నారు. కేసీఆర్ బీమా పథకాన్ని బీజేపీ నాయకులు అవహేళన చేస్తున్నారని, అలాంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు కవిత. మంచి చేస్తున్నవాళ్లను కాదని ఇతరుల వైపు చూడొద్దన్నారామె. సీఎం కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచించేవారు, పనిచేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు కవిత. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా సాకారం చేస్తున్నారని చెప్పారు.