భారత రాజ్యాంగమా..? బీజేపీ రాజ్యాంగమా..?

ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమన్నారు కవిత. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement
Update:2023-09-26 12:05 IST

దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉందా, లేక బీజేపీ రాజ్యాంగం అమలవుతుందా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారామె. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై వ్యవహరించారని అన్నారు. అసెంబ్లీ హాలులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కవిత. ఐలమ్మకు పుష్పాంజలి ఘటించారు.

ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమన్నారు కవిత. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, గవర్నర్‌ కోటాకు సరితూగే దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసిందని, అయితే ఆ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందని, ఈ కారణంగానే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించానని గవర్నర్ పేర్కొనడం సరికాదని అన్నారు కవిత.

రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయాలు చేయటమే పరమావధిగా తమిళి సై వ్యవహారశైలి ఉందని విమర్శించారు కవిత. గవర్నర్‌ పదవి చేపట్టేముందు ఫక్తు రాజకీయ పదవిలో ఉన్న తమిళి సై రాజకీయాల్లో ఉన్నారంటూ ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలు తిరస్కరించానని చెప్పడం రాజకీయం కాక మరేమిటని ప్రశ్నించారు. బీసీ వర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపీట వేస్తోందని, తమది బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోసారి నిరూపించుకున్నదని అన్నారు కవిత. కమలం పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News