తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆయన విగ్రహం పెట్టాలి..
వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగిన బిడ్డగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఈ మహత్కార్యం జరగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈమేరకు ఆమె అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలసి వినతిపత్రం అందించారు. సభా ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం గొప్ప ఆదర్శమని చెప్పారామె. గతంలో భారత్ జాగృతి తలపెట్టిన ఉద్యమంతో సమైక్య రాష్ట్రంలో సభా ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు కవిత. అదేవిధంగా సమానత్వ స్ఫూర్తిని చాటేలా ఫూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు.
ఈరోజు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని స్పీకర్ ప్రసాద్ నివాసానికి వెళ్లారు కవిత. అసెంబ్లీ ప్రాంగణంలో ఫూలే విగ్రహ ఏర్పాటు గురించి చర్చించారు. విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా పూలే కృషి చిరస్మరణీయం అని చెప్పారు కవిత. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షతకు ఆయన చరమగీతం పాడారన్నారు. దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మొదటి వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. అంబేద్కర్ అంత మహనీయుడే ఫూలేని తన గురువుగా ప్రకటించుకున్నారని చెప్పారు. అలాంటి మహనీయుల విగ్రహాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉండటం ఆదర్శనీయం అన్నారు. తమ పోరాట ఫలితంగానే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఫూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత స్పీకర్ ని కోరారు.
వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగిన బిడ్డగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఈ మహత్కార్యం జరగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఆయన్ని సవినయంగా కోరుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సమానత్వ సౌభ్రాతృత్వాలు వెల్లి విరియాలని ఆకాంక్షించారు కవిత.