హంతకులే నివాళులర్పించినట్టుంది అమిత్ షా సభ
మూడు నల్ల చట్టాలు తెచ్చి 850 మంది రైతుల మరణాలకు కారణమైన పార్టీని రైతులు ఎలా నమ్ముతారన్నారు. రైతు సదస్సు పేరుతో ఏ మొహం పెట్టుకుని అమిత్ షా తెలంగాణలో పర్యటించారని ప్రశ్నించారు కవిత.
రైతుల గురించి బీజేపీ మాట్లాడటం పెద్ద జోక్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. చావగొట్టి, చెవులు మూసి, చివరకు వారే వచ్చి ఫొటోకు దండ వేసినట్టుందని.. అమిత్ షా సభపై చెణుకులు విసిరారు. మూడు నల్ల చట్టాలు తెచ్చి 850మంది రైతుల మరణాలకు కారణమైన పార్టీని రైతులు ఎలా నమ్ముతారన్నారు. తెలంగాణలో 30లక్షలకు పైగా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ నియమం పెట్టినా తెలంగాణ ఆ పని చేయలేదని చెప్పుకొచ్చారు. రైతు సదస్సు పేరుతో ఏ మొహం పెట్టుకుని అమిత్ షా తెలంగాణలో పర్యటించారని ప్రశ్నించారు కవిత.
మీ సీఎం అభ్యర్థి ఎవరు..?
తెలంగాణలో ప్రతిపక్షాలకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేసారు ఎమ్మెల్సీ కవిత. తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని.. అసలు వారి పార్టీలకు సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పగలరా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ.. కన్ఫ్యూజన్, ఫ్రస్టేషన్లో ఉన్నాయని ఎద్దేవా చేసారు. గంప గోవర్దన్ చేతిలో పదే పదే ఓడిపోయిన షబ్బీర్ అలీకోసం సీఎం కేసీఆర్ కామారెడ్డికి రావాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ పోటీ తమ పార్టీ వ్యూహంలో భాగమని చెప్పుకొచ్చారు కవిత.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై కూడా మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక నాయకులు చెబితే ప్రజలు నమ్మరని, అందుకే ఖర్గేని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. వేలం పాట పాడినట్టుగా వారి ప్రకటనలున్నాయని చెప్పారు. దళితబంధు తాము 10లక్షల రూపాయలిస్తుంటే వారు 12 లక్షలు అంటున్నారని, పెన్షన్ 2వేలు ఇస్తుంటే, వారు 4వేలిస్తామంటూ మోసం చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారికి ఉన్నది భావదారిద్రమే తప్ప భావోద్వేగం కాదన్నారు. దళితుల కోసం పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మల్లికార్జున్ ఖర్గేకి ఇచ్చారు కానీ, అంతకు మించి దళితులకు వారు చేసిందేమీ లేదన్నారు. అన్నీ తిప్పి తిప్పి చెబుతున్నారే కానీ, వారి డిక్లరేషన్లో ఒక్కటీ నిజం లేదన్నారు కవిత. కర్నాటకలో పెద్ద పెద్ద వాగ్దానాలతో గెలిచిన కాంగ్రెస్, చివరకు వాటిని అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
♦