కుటుంబ పాలన గురించి ప్రియాంక మాట్లాడటం అతిపెద్ద జోక్
తాత ముత్తాతల నుం చి కాంగ్రెస్ పార్టీని వారు గుప్పెట్లో పెట్టుకున్నారని, పేరుకి ఎవరైనా అధ్యక్షుడిగా ఉన్నా కూడా పెత్తనం వీరిదేనని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.
కాంగ్రెస్ పార్టీని నెహ్రూ కుటుంబం ఎలా కంట్రోల్ చేస్తోందనే విషయం అందరికీ తెలుసని, ఆ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు ఎమ్మెల్సీ కవిత. తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీని వారు గుప్పెట్లో పెట్టుకున్నారని, పేరుకి ఎవరైనా అధ్యక్షుడిగా ఉన్నా కూడా పెత్తనం వీరిదేనని చెప్పారు. ఇతర పార్టీల్లో కుటుంబాల నుంచి వచ్చినవారు ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తారని, కానీ కాంగ్రెస్ పార్టీలో రిమోట్ కంట్రోల్ వారి కుటుంబం దగ్గరే ఉంటుందన్నారు.
కాంగ్రెస్ కి ఓటేస్తే కర్నాటక గతే..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేస్తే.. కర్నాటకకు పట్టిన గతే పడుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మోసం ఆ పార్టీ నైజం అని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో రైతులకు రోజుకి 20 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు 5 గంటల కరెంటుతో సరిపెట్టుకోవాలని కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ చెబుతున్నారని అన్నారు కవిత. కర్నాటక మంత్రి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కర్నాటకలో రైతుల్ని మోసం చేసినట్టే తెలంగాణలో కూడా మోసం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంతకు ముందే హింటిచ్చారని, రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటలు అనవసరం అని ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలన్నారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటు వేస్తే, రైతులకు కష్టాలు తప్పవని చెప్పారు కవిత.
♦