కిషన్ అన్నా..! ట్విట్టర్లో కవిత కౌంటర్..
బీఆర్ఎస్ జాబితా విడుదల తర్వాత బీజేపీ నిరాశ, గందరగోళం తమకు అర్థమైందని అన్నారు కవిత. తమ పార్టీలో టికెట్లు దక్కని ఆశావహులకు బీజేపీ గేలం వేసేందుకు రెడీగా ఉందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు ఎమ్మెల్సీ కవిత. మహిళల హక్కుల పట్ల కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నేతలు ఆందోళన చెందడం నిజంగా స్వాగతించదగిన విషయం అని గుర్తు చేశారామె. "దయచేసి మీ రాజకీయ అభద్రతాభావాలను మహిళల ప్రాతినిధ్యంతో ముడిపెట్టవద్దు." అంటూ కిషన్ రెడ్డికి బదులిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేయించలేరా..?
లోక్ సభ, రాజ్యసభలో ఎలాంటి బిల్లునైనా బీజేపీ ప్రభుత్వం పాస్ చేయించుకోగలదు. ఇటీవల ఢిల్లీ సర్వీసెస్ బిల్లుని సైతం ఏకపక్షంగా ఆమోదించుకుంది బీజేపీ. మరి ఎన్నికల్లో ఆ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు హామీని మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఈ బిల్లుకి ఆమోదం ఎప్పుడు..? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కిషన్ అన్నా..! పార్లమెంట్ లో ఏ బిల్లునైనా అత్యథిక మెజార్టీతో ఆమోదింపజేసుకోగల బీజేపీ.. మహిళా బిల్లుని ఎందుకు తొక్కి పెట్టింది అంటూ నిలదీశారు.
బీఆర్ఎస్ జాబితా విడుదల తర్వాత బీజేపీ నిరాశ, గందరగోళం తమకు అర్థమైందని అన్నారు కవిత. తమ పార్టీలో టికెట్లు దక్కని ఆశావహులకు బీజేపీ గేలం వేసేందుకు రెడీగా ఉందన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఎంతమంది మహిళలకు టికెట్లు ఇస్తాయో తాము కూడా చూస్తామని చెప్పారు కవిత. అదే సమయంలో చట్టం ద్వారానే మహిళల హక్కులను కాపాడగలం అని గుర్తు చేశారు. పార్లమెంటులో సీట్లు పెంచి అందులో మూడో వంతు మహిళలకు కేటాయించాలనే ఫార్ములాని సీఎం కేసీఆర్ ప్రతిపాదించినట్టు గుర్తు చేశారు కవిత.
♦