కేసీఆర్ కూతురును కాబట్టే నన్ను టార్గెట్ చేశారు: కవిత‌

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్రలేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తన తండ్రి కేసీఆర్ ను దెబ్బకొట్టడానికే బీజేపీ నాయకులు తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏ విచారణకైనా తాను సిద్దంగా ఉన్నానని ఆమె తెలిపారు.

Advertisement
Update:2022-08-22 14:03 IST

ఢిల్లీ లో మద్యం కుంభకోణంపై బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణలను టీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురును కాబట్టే బీజేపీ నేతలు తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. బట్ట కాల్చి మీదేయడం బీజేపీకి అల‌వాటే అని, నన్ను మానసికంగా కృంగదీయడానికి, తద్వారా కేసీఆర్ ను దెబ్బతీయడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు.

బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ వెనుకంజ వేయరు. తన పోరాటాన్ని ఆపరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఇలాంటి కుట్రలు చాలా చూశారు అని కవిత అన్నారు.

బిల్కిస్ బానో కు జరిగిన అన్యాయం, రేపిస్టుల విడుదల, ఉద్యోగ కల్పన తదితర విషయాలపై తాము పోరాడుతూనే ఉంటామని, మేమడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని కవిత అన్నారు. తానుగానీ, కేసీఆర్ గానీ ఎలాంటి విచారణ‌కైనా సిద్దమని చెప్పిన కవిత, జాతీయ దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని విపక్షాలను బెదిరించాలనుకుంటే సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. మేము మొక్కవోని ధైర్యంతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన, చేస్తున్న‌ వ్యక్తులం, ఇలాంటి కుట్రలకు భయపడబోమని అన్నారు కవిత. యావత్తు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, అదే ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తాం. ఎవరెన్ని రకాలుగా బెదిరించినా తల వంచబోం అన్నారు కల్వకుంట్ల కవిత‌

Tags:    
Advertisement

Similar News