24గంటల్లో నిరూపించు.. లేదంటే ముక్కు నేలకు రాయి

ఎంపీ అరవింద్ పిచ్చి ప్రేలాపనలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అరవింద్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారామె. లేకపోతే ముక్కు నేలకు రాయాల్సిందేనని చెప్పారు.

Advertisement
Update:2023-07-21 16:29 IST

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తనపై చేసిన ఆరోపణలను 24గంటల్లో రుజువు చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కవిత. రుజువు చేయని పక్షంలో పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారామె. తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. ఎంపీ అరవింద్ బాల్కొండలో అతిగా, అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు కవిత. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అసలేం జరిగింది..?

ఇటీవల బాల్కొండలో పర్యటించిన ఎంపీ అరవింద్ అక్కడ వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే రాష్ట్రం వాటిని స్వాహా చేసిందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. లిక్కర్ స్కామ్ అంటూ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు అరవింద్. త్వరలో ఆమె జైలుకి వెళ్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందన్నారు. అయితే ఈ ఆరోపణలపై కవిత కూడా అంతే ఘాటుగా స్పందించారు. అండర్ గ్రౌండ్ డ్రైనెజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసని చురకలంటించారు. ఎంపీ అరవింద్ పిచ్చి ప్రేలాపనలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అరవింద్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారామె. లేకపోతే ముక్కు నేలకు రాయాల్సిందేనని చెప్పారు.

ప్రజలవైపే మేము..

తాము ఎన్డీఏ కూటమి కాదని, ఇండియా కూటమిలోనూ లేమని ప్రజలవైపు ఉన్నామని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. తమ విధానం ధరణి అని, కాంగ్రెస్ విధానం దళారి అని ఎద్దేవా చేశారు. గతంలో సోనియా గాంధీని, వైఎస్ఆర్ ని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని పొగుడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్నవారంతా సింహాలేనని, కొన్ని పార్టీల్లో గ్రామ సింహాలు కూడా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. సర్వేల్లో ఏ పార్టీ తమ దరిదాపుల్లో లేదన్నారు కవిత. 

Tags:    
Advertisement

Similar News