కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈనెల 16 వరకు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. బెయిల్ పిటిషన్ పై ఈడీ సమాధానం కోరుతూ విచారణను ఏప్రిల్-4కు వాయిదా వేసింది కోర్టు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 4వతేదీకి వాయిదా పడింది. ఈమేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, పిటిషన్ ని వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 26న ఆమెకు 14రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో బెయిల్ పిటిషన్ విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈరోజు తిరిగి విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్-4కు వాయిదా వేసింది. కవిత పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది కోర్టు.
తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈనెల 16 వరకు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈరోజు ఇరుపక్షాల వాదనలు విన్నది. బెయిల్ పిటిషన్ పై ఈడీ సమాధానం కోరుతూ విచారణను ఏప్రిల్-4కు వాయిదా వేసింది.
మరోవైపు కవిత విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు, అదే రోజు ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు ఆమెను కోర్టులో హాజరు పరిచి, తమ కస్టడీలోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. మొదట ఏడు రోజులు, ఆ తర్వాత మరో మూడు రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత కవితకు రిమాండ్ విధించింది. గతంలో కవిత సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కింది కోర్టుకి వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు సూచించింది.