నేడు ఢిల్లీ కోర్టు ముందుకి కవిత.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు నేతలు.

Advertisement
Update:2024-03-16 09:55 IST

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈరోజు ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈడీ అధికారుల పర్యవేక్షణలో మహిళా డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ఆమెను ఢిల్లీలోని పరివర్తన్ భవన్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్ లో ఉంచారు. ఈరోజు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు. ఈడీ ఆమెను కస్టడీకి కోరే అవకాశముంది. అయితే కోర్టు, ఈడీ కస్టడీకి ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే, 14రోజుల రిమాండ్ విధించే అవకాశముంది.

బెయిల్ పిటిషన్..

మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. దీనిపై కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశముంది. కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా, లేక రిమాండ్ కి తరలిస్తారా, బెయిల్ పిటిష్ పై వెంటనే విచారణ జరిపి జామీను మంజూరు చేస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు..

కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని సూచించారు నేతలు. కవిత అరెస్ట్ అక్రమం అంటూ నిన్నటి నుంచే నిరసనలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా కవిత అరెస్ట్ ని ఖండించారు, పలువురు మీడియా ముందుకొచ్చారు. పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News