చెప్పింది చేసేది, చేసేదే చెప్పేది.. కేసీఆర్ ఒక్కరే
నిజామాబాద్ ఐటీ హబ్ లో 3200 ఉద్యోగాలు స్థానిక యువతకు లభించాయన్నారు. రానున్న ప్రభుత్వంలో విద్య, వైద్యం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు కవిత.
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారన్నారు, చేసేదే ఆయన చెప్తారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధే దీనికి నిదర్శనం అని అన్నారు కవిత. కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ జిల్లాలో కేవలం ఒక్కటే మైనారిటీ పాఠశాల ఉండేదని, ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కవిత.
నాగారంలో రోడ్ షో..
నిజామాబాద్ జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ అర్బన్, రూరల్ సహా బోధన్ లో కూడా పలుమార్లు ఆమె రోడ్ షో లలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కూడా ఆమె పాల్గొన్నారు. తాజాగా.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఆమె రోడ్ షో నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలసి రోడ్ షో లో పాల్గొన్నారు కవిత. తెలంగాణ రాకముందు నిజామాబాద్ లో పరిస్థితి దయనీయంగా ఉండేదని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. నాగారం కాలనీని దత్తత తీసుకుని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు కవిత.
60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసిందేమీ లేదన్నారు కవిత. వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని భరోసా ఇచ్చారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పారు. గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదన్నారు కవిత. నిజామాబాద్ ఐటీ హబ్ లో 3200 ఉద్యోగాలు స్థానిక యువతకు లభించాయన్నారు. రానున్న ప్రభుత్వంలో విద్య, వైద్యం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు కవిత.