రాహుల్ వర్సెస్ రైతన్నలు
గాంధీలకే గ్యారంటీ లేదని వారిచ్చే గ్యారంటీలను ఎలా నమ్మాలన్నారు కవిత. రేవంత్ కామారెడ్డికి వచ్చినా, ఈటల గజ్వేల్ లో పోటీ చేసినా కేసీఆర్ కి వచ్చే నష్టమేమీ లేదన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ కి రైతన్నలకు మధ్య పోటీ జరగబోతోందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఈ ఎన్నికలను 'రాహుల్ వర్సెస్ రైతన్నలు' గా ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్ వాళ్లకు రాహుల్ గాంధీ ఉంటే... తమకు రైతన్నలు అండగా ఉన్నారని చెప్పారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని ఆ పార్టీ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు కవిత.
కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు రైతుబంధు మాత్రమే ఆపేయాలా... లేక అన్ని పథకాలను ఆపేయాలా అని ప్రశ్నించారు కవిత. సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్ అని, కేసీఆర్ ఇస్తున్న పథకాలు ఆపుకుంటూ వెళ్లాలంటే ముందు కరెంట్ కట్ చేయాలని, ఆ తర్వాత మిషన్ భగీరథ నీళ్లు ఆపాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఆపాల్సి వస్తుందన్నారు. వీటిని ఆపడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు కవిత. పదేళ్లుగా నడుస్తున్న ఈ పథకాలను ఆపాలని చెబుతున్న కాంగ్రెస్ ఎంతటి అభద్రతాభావంతో ఉందో అర్థమవుతోందన్నారు. సంక్షేమ పథకాలు నిలిపివేయాలని చూస్తే, రైతులను బాధపెడితే కాంగ్రెస్ కే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు కవిత.
గాంధీలకే గ్యారెంటీ లేదు..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సోనియా యాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీలు మాత్రమే హామీలు ఇస్తున్నారని.. అసలు కాంగ్రెస్ తరపున మాట్లాడటానికి వారికి ఏ హోదా ఉందని ప్రశ్నించారు కవిత. ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను పక్కకు పెట్టి వారు గ్యారంటీలు ఇవ్వడమేంటని అన్నారు. గాంధీలకే గ్యారంటీ లేదని వారిచ్చే గ్యారంటీలను ఎలా నమ్మాలన్నారు కవిత. రేవంత్ కామారెడ్డికి వచ్చినా, ఈటల గజ్వేల్ లో పోటీ చేసినా కేసీఆర్ కి వచ్చే నష్టమేమీ లేదన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే ఓడించడానికి తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు కవిత.