సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదు : ఎమ్మెల్సీ కవిత

గులాబీ కండువా అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు సురక్షితంగా ఉంటారని కవిత చెప్పారు. మన జెండా ఎగిరే ప్రతీ నియోజకవర్గంలో అభివృద్ధి తప్పకుండా జరుగుతుందని ఆమె అన్నారు.

Advertisement
Update:2022-11-12 18:12 IST

తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదని.. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్‌ 1గా నిలిపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశవ్యాప్తంగా విప్లవం సృష్టించాలనే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని, ఇండియాలో గులాబీ కండువా సంచలనం సృష్టించబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత.. పలు విషయాలపై మాట్లాడారు.

గులాబీ కండువా అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు సురక్షితంగా ఉంటారని కవిత చెప్పారు. మన జెండా ఎగిరే ప్రతీ నియోజకవర్గంలో అభివృద్ధి తప్పకుండా జరుగుతుందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే మన రికార్డులను మనమే బద్దలు కొట్టుకునే వాళ్లమని అర్థం. మనం వేరే వాళ్ల రికార్డులు బద్దలు కొట్టడం కాదని కవిత చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురేసేలా కార్యకర్తలు 24 గంటలు కష్టపడి పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

గతంలో మంత్రిగా పని చేసిన జీవన్ రెడ్డి నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. ఒకప్పుడు రాయికల్ మండలంలో వలసలు ఉండేవి. కానీ ఇప్పుడు పంటలమయం అయిపోయిందని కవిత చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ 20 వేల ఎకరాల్లో వరి సాగు అయ్యేది. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక 64 వేల ఎకరాల్లో వరి పంట సాగవుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ముఖంలో సంతోషం వెల్లివిరిసిందన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల గురించి ఆలోచించే నాయకుడు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఒక్క రాయికల్ మండలంలోనే 16,700 మంది కార్మికులు పెన్షన్లు పొందుతున్నారని గుర్తు చేశారు.

ప్రధాని మోడీ వస్తున్నారని సీఎం కేసీఆర్ మొహం చాటేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మరి రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణకు రాగానే.. కాంగ్రెస్ నాయకులు మునుగోడు ప్రజలకు ఎందుకు మొఖం చాటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నడూ మొఖం చాటేసే నాయకుడు కాదు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రమే అలా చేస్తారని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఏదో ఒక విమర్శ చేసి వార్తల్లో నిలవాలని జీవన్ రెడ్డి ఆరాటపడుతుంటారని కవిత ఎద్దేవా చేశారు.

జీవన్ రెడ్డి మంత్రిగా ఉండి రోళ్ల వాగు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడు రూ. 135 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నామన్నారు. అనేక మోసాలు చేసి అభివృద్ధికి అడ్డు పడింది జీవన్ రెడ్డే అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలన పారదర్శకంగా సాగుతోందని, రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని కవిత చెప్పారు.

Tags:    
Advertisement

Similar News