ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దాతృత్వం.. ఒక్క మాటతో తాళి కట్టిన వరుడు

అయితే అదే పెళ్లికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చొరవ తీసుకుని అమ్మాయి తరఫున బైక్ తాను కొనిస్తానమి మాట ఇవ్వడమే కాదు.. అక్కడికక్కడే రూ.50 వేలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. దాంతో వరుడు వెంటనే అమ్మాయి మెడలో తాళికట్టాడు.

Advertisement
Update:2023-05-13 13:22 IST

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ అమ్మాయిపెళ్లి పీటలపై ఆగిపోకుండా కాపాడారు. కొన్ని నిమిషాల్లో పెళ్లి చేసుకోబోతున్న వరుడు.. ఆఖర్లో బైక్ కొనిచ్చే వరకూ తాళి కట్టబోనని భీష్మించుకుని కూర్చున్నాడు. దాంతో వధువు తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. వరుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే అదే పెళ్లికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చొరవ తీసుకుని అమ్మాయి తరఫున బైక్ తాను కొనిస్తానమి మాట ఇవ్వడమే కాదు.. అక్కడికక్కడే రూ.50 వేలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. దాంతో వరుడు వెంటనే అమ్మాయి మెడలో తాళికట్టాడు.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్ పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ, మల్లయ్య కూతురు అనూషకి సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ తో వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులది దళిత పేద కుటుంబం. అయినప్పటికీ పెళ్లికి ముందే వరుడి కుటుంబ సభ్యులకి రూ.5 లక్షలు కట్నకానుకల రూపంలో ముట్టచెప్పారు. కానీ.. కట్నంలో భాగంగా తనకు ఇవ్వాల్సిన బైక్ ఇవ్వలేదని పెళ్లి మండపంలో వరుడు అలిగాడు. బైక్ కొనిస్తేనే తాళి కడతానని తేల్చిచెప్పేశాడు.

బైక్ గురించి వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య మండపంలో కాసేపు గొడవ జరిగింది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత బైక్ కొనిస్తామని వధువు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినా వరుడు మాత్రం పట్టువీడలేదు. దాంతో పెళ్లి ఆగిపోతోందని వధువు కుటుంబ సభ్యులు ఏడుస్తూ కనిపించారు. దాంతో చలించిపోయిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వరుడితో మాట్లాడి బైక్ కొనుగోలుకి అవసరమైన డబ్బును పెళ్లి కూతురి తరపున తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ముందుగానే రూ. 50 వేల డబ్బుని వరుడి తండ్రికి మండపంలోనే అందజేశారు. మిగిలిన డబ్బుని బైక్ షోరూంకి నేరుగా ఇస్తానని హామీ ఇచ్చారు. దాంతో వరుడు తాళి కట్టాడు.

Tags:    
Advertisement

Similar News