మా పథకాలు.. మా ఇష్టం
కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్లకే ప్రభుత్వ పథకాలని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఎందుకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చేసిన వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది. మా ప్రభుత్వంలో మా ఇష్టం అన్నట్టు నేతలు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు వస్తాయని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అధికారులు మా మాట వినకుంటే ఏ ఊరిలో ఏ ఒక్క ప్రభుత్వ పథకం అమలు కాలని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాల అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్ట్ మాత్రమే ఫైనల్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్,డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే అ గ్రామంలో ఎవ్వరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తానని బహిరంగ హెచ్చరించారు. ఏ ప్రభుత్వ పథకం అయినా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇస్తాం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఇందిరమ్మ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల, నేత వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన అర్హులకే పథకాలు చేరాలన్న ఉద్దేశంతోనే గ్రామసభలు నిర్వహిస్తున్నామంటున్న ప్రభుత్వ ప్రకటనలు ఉత్తమాటలేనని తేలిపోయిందని స్పష్టమవుతున్నది.
నాలుగు పథకాల్లో అనర్హులను లబ్ధిదారుల్లో చేరుస్తున్నారని ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో అధికారులను నిలదీస్తున్నారు. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామాల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి భిన్నంగా గ్రామాల్లో పరిణామాలు జరుగుతున్నాయి. ఆరు గ్యారెంటీలు, రేషన్ కార్డుల కోసం ప్రజలు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్న సభల్లో అధికారులకు, ప్రజల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది.