పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలసిన వెంటనే ఆయన పార్టీ మారుతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆయన స్పందించడం ఆలస్యం కావడంతో ఈ పుకార్లు నిజమేనంటూ రచ్చ మొదలైంది.
రాజ్యసభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. వీరిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఒక గ్రూప్ గా రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆ తర్వాత వెంటనే వారు పుకార్లను ఖండించారు. తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికోసమే సీఎంని కలిశామని, అంతకు మించి ఇంకే విశేషం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా సీఎంని కలిశారు. ఆయన కూడా తాజాగా ఈ మీటింగ్ పై క్లారిటీ ఇచ్చారు.
పార్టీ మారను..
సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలసిన వెంటనే ఆయన పార్టీ మారుతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆయన స్పందించడం ఆలస్యం కావడంతో ఈ పుకార్లు నిజమేనంటూ రచ్చ మొదలైంది. అయితే ప్రకాశ్ గౌడ్ కూడా మీడియా ముందుకొచ్చారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, మూసీ సుందరీకరణ, బహదూర్‌పుర భూముల విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని తాను కలిశానని వివరణ ఇచ్చారు ప్రకాశ్ గౌడ్. తన విజ్ఞప్తిపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని కూడా తెలిపారు. తనను ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారని అన్నారు.
రేవంత్ కి కూడా ఆ ఉద్దేశం లేదు..
తాను పార్టీ మారడంలేదు అని చెప్పడంతోపాటు.. తనను పార్టీ మారాలని కోరే ఉద్దేశం కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేదు అని సర్టిఫికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రకాశ్ కౌడ్. తనపై బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానానికి నమ్మకం ఉందని, సీఎంని కలసిన తర్వాత తాను పార్టీకి సమాచారం ఇచ్చానని కూడా చెప్పారాయన. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరపడం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. అయితే ఈరోజు ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఆయన పార్టీ మారడంలేదు అని తేలిపోయింది.